90 శాతం జీమెయిల్‌ అకౌంట్లకు హ్యాకర్ల ముప్పు

22 Jan, 2018 20:16 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా అధునాతన హ్యాకర్ల ముప్పు పెరుగుతున్నప్పటికీ, జీమెయిల్‌ అకౌంట్‌ యూజర్లు మాత్రం అసలు జాగ్రత్తగా లేరని తెలిసింది. దాదాపు 90 శాతం జీమెయిల్‌ అకౌంట్‌ యూజర్లకు సైబర్‌ దాడి పొంచుకుని ఉందని గూగుల్‌ తెలిపింది. 10 శాతం మంది కంటే తక్కువ మంది జీమెయిల్‌ యూజర్లు మాత్రమే హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు రెండు దశల ప్రమాణీకరణను కలిగి ఉన్నారని చెప్పింది. యూజర్ల అకౌంట్ల యాక్సస్‌ను పొందడానికి హ్యాకర్లకు అత్యుత్తమ మార్గం పాస్‌వర్డ్‌లని, ముఖ్యంగా వ్యాపారవేత్తలు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, వెంటనే రెండు దశల ప్రమాణీకరణను అమలు చేసుకోవాలని గూగుల్‌ ఇంజనీర్లు తెలిపారు.

 కేవలం 12 శాతం మంది అమెరికన్లు మాత్రమే తమ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్‌వర్డ్‌ మేనేజర్‌ను కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన న్యూస్‌ వెబ్‌సైట్‌ టెక్‌ రిపబ్లిక్‌ రిపోర్టు చేసింది. అకౌంట్లు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు, పాస్‌వర్డ్‌లను కాపాడుకోవడానికి రెండు దశల ప్రమాణీకరణ ఎంతో ముఖ్యమని తెలిపింది. 2011లో తొలిసారి గూగుల్‌ ఈ రెండు దశల ప్రమాణీకరణను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ సురక్షిత చర్యలను ఎక్కువ మంది పాటించడం లేదు. లాగిన్‌ అయిన కొన్ని సెకన్లకే ఈ ఫీచర్‌ యాడ్‌ అవుతుంది. కానీ ఈ ఫీచర్‌ను గూగుల్‌ యూజర్లందరికీ తప్పనిసరి చేయలేదు. ఇటీవల కాలంలో యూజర్ల భద్రతను మెరుగుపరుచేందుకు గూగుల్‌ పలు చర్యలను తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు