-

904 సంస్థల్లో మహిళా డెరైక్టర్లు నిల్

8 Jul, 2014 01:57 IST|Sakshi
904 సంస్థల్లో మహిళా డెరైక్టర్లు నిల్

న్యూఢిల్లీ: లిస్టెడ్ సంస్థల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా డెరైక్టరయినా ఉండాలన్న నిబంధన అమలుకి గడువు దగ్గరపడుతున్నా చాలా మటుకు కంపెనీలు ఇప్పటిదాకా ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి కంపెనీలు దాదాపు 904 ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,492 కంపెనీల్లో ఇది దాదాపు 62 శాతం. ఇక మరికొన్ని కంపెనీల్లో నియమితులైన డెరైక్టర్లలో చాలా మంది ప్రమోటరు గ్రూపునకు చెందిన వారే కావడం గమనార్హం.

 ఎన్‌ఎస్‌ఈ, ప్రైమ్ డేటాబేస్ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఇండియాబోర్డ్స్‌డాట్‌కామ్ డేటాబేస్ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్ 30 దాకా అందుబాటులో ఉన్న డేటాను బట్టి చూస్తే వచ్చే మూడు నెలల్లో రోజుకు 10 మంది డెరైక్టర్ల నియామకం జరగాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా డెరైక్టరయినా ఉండేలా చూసే దిశగా కొత్త కంపెనీల చట్టం, సెబీ నిర్దేశించిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీల్లో ప్రమోటర్ల కుటుంబాలకు చెందిన మహిళలనే డెరైక్టర్లుగా తీసుకోవడంతో ఈ నిబంధన ప్రధాన లక్ష్యమే దెబ్బతినే అవకాశం ఉందని ప్రైమ్ డేటాబేస్ ఎండీ పృథ్వి హల్దియా అభిప్రాయపడ్డారు. ఈ డెరైక్టర్లు ప్రమోటరు బాణీనే వినిపిస్తారు కనుక.. స్వతంత్ర డెరైక్టర్లుగా వ్యవహరించలేరని పేర్కొన్నారు.

ఇండియన్‌బోర్డ్స్‌డాట్‌కామ్ నివేదికలో మరికొన్ని విశేషాలు ఇవి..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ నిబంధనలను ప్రకటించిన తర్వాత నుంచి నాలుగున్నర నెలల వ్యవధిలో నికరంగా 78 కంపెనీలు మాత్రమే మహిళా డెరైక్టర్ల నియామకం జరిపాయి. 80 పదవుల్లో 74 మందిని తీసుకున్నాయి. కొందరు రెండు పైగా కంపెనీల్లో డెరైక్టర్లుగా నియమితులయ్యారు.

 74 మందిలో 59 మంది తొలిసారిగా ఈ హోదా చేపట్టారు. వీరిలో 15 మంది ప్రమోటరు గ్రూప్‌నకు చెందిన వారు.

 అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్‌లో అత్యధికంగా నలుగురు మహిళా డెరైక్టర్లు ఉన్నారు. వీరిలో స్వతంత్రులెవరూ లేరు. ఇక, ఇతర సంస్థల్లో ప్రమోటర్ కుటుంబానికి చెందిన వారిలో నీతా అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి) కూడా ఉన్నారు.

ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల్లోని 11,527 డెరైక్టర్ పదవుల్లో 8,987 మంది కొనసాగుతున్నారు. వీరిలో కేవలం 673 పదవుల్లో మాత్రమే మహిళలు ఉన్నారు.

మరిన్ని వార్తలు