పూర్తి స్థాయిలోడిజిటలైజేషన్‌కు 20 ఏళ్లు ఆగాల్సిందే!

28 Dec, 2016 00:28 IST|Sakshi
పూర్తి స్థాయిలోడిజిటలైజేషన్‌కు 20 ఏళ్లు ఆగాల్సిందే!

మెట్రో నగరాలైతే మూడు నాలుగేళ్లు
నగదు రహిత లావాదేవీలపై అసోచాం అంచనా


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గ్రామాలన్నీ డిజిటల్‌ చెల్లింపులకు మళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పడుతుందని అసోచాం వెల్లడించింది. మెట్రోలు, పెద్ద నగరాలకైతే మూడు నాలుగేళ్ల సమయం పట్టొచ్చని అసోచాం సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ తెలిపారు. అది కూడా ఈ నగరాల్లో 65–70 శాతం మాత్రమే డిజిటల్‌ లావాదేవీలు జరగొచ్చని అంచనాగా చెప్పారు. నగదు రహితానికి మరిన్ని ఉద్దీపనలను ప్రధాని మోదీ డిసెంబరు 30న ప్రకటిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొబైల్‌ వాలెట్ల స్థితిగతులపై కన్సల్టెన్సీ కంపెనీ ఆర్‌ఎన్‌సీవోఎస్‌తో కలసి అసోచాం రూపొందించిన నివేదికను మంగళవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

గ్రామీణ భారతమే ఎక్కువ..
భారత జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. నెటిజన్ల సంఖ్య పరిమితంగా ఉన్న కారణంగా గ్రామాల్లో డిజిటల్‌ లావాదేవీలు పెద్ద సమస్యేనని రావత్‌ వ్యాఖ్యానించారు. మొబైల్‌ వాలెట్లు కేవలం ఇంగ్లిషులోనే ఉన్నాయని గుర్తు చేశారు. చదువుకున్న వారికి డిజిటల్‌ లావాదేవీలతో సమస్య లేదని అన్నారు. నిరక్షరాస్యులకే ఇబ్బందులని చెప్పారు. 2 లక్షల ఏటీఎంలలో గ్రామాల్లో 20 శాతమే ఉన్నాయని, దీంతో సమస్య మరింత క్లిష్టమని వివరించారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 100 శాతం భద్రమని చెప్పలేమన్నారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇప్పటికీ పెద్ద సవాల్‌ అని ఆర్‌ఎన్‌సీవోఎస్‌ ఫౌండర్‌ శుష్ముల్‌ మహేశ్వరి అన్నారు.

ప్రభుత్వానిదే బాధ్యత..
ఖాతాదారుల నగదు భద్రత బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఇంటెగ్రేటర్స్‌ ఇండియా చైర్మన్‌ బాబు లాల్‌ జైన్‌ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరాల ముప్పు పొంచి ఉంది. వీటి మూలంగా ఏటా 4 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఐటీ ఉన్నంత కాలం ఈ ముప్పు తప్పదు. సైబర్‌ నేరగాళ్ల బారిన సాధారణ ప్రజలు పడకూడదు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. డిజిటల్‌ లావాదేవీల పట్ల పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వివరించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ పోలీసు ఉండాలన్నారు.

ఎం–వాలెట్ల హవా..: దేశంలో మొబైల్‌ వాలెట్ల లావాదేవీల విలువ 2012–13లో రూ.1,000 కోట్లు ఉంది. 2015–16లో రూ.20,600 కోట్లకు ఎగసిందని ఆర్‌ఎన్‌సీవోఎస్‌–అసోచాం నివేదిక వెల్లడించింది. 2021–22 నాటికి ఇది రూ.275 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. లావాదేవీల సంఖ్య 300 కోట్ల నుంచి అయిదేళ్లలో 46,000 కోట్లను తాకుతుందని వివరించింది. మొబైల్‌ పేమెంట్ల రంగంలో లావాదేవీల పరంగా మొబైల్‌ వాలెట్‌ వాటా ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 2021–22 కల్లా 57 శాతానికి చేరుతుందని వెల్లడించింది. వాలెట్ల నుంచి రిటైల్‌పై సగటు వ్యయం రూ.500–700 ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది రూ.10 వేల దాకా చేరుతుందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు