మార్కెట్‌కు ట్రంప్‌ షాక్‌!

7 May, 2019 01:27 IST|Sakshi

మళ్లీ తలెత్తిన సుంకాల పోరు

చైనా వస్తువులపై సుంకాలు విధిస్తాం 

ఆదివారం అమెరికా అధ్యక్షుడి ట్వీట్‌  

ప్రపంచ మార్కెట్ల పతనం  

మందగమనంగా సేవల రంగ వృద్ధి 

సుంకాల పోరుతో విదేశీ నిధులకు బ్రేక్‌ !  

363 పాయింట్లు పతనమై 38,600కు సెన్సెక్స్‌ 

114 పాయింట్లు తగ్గి 11,598కు నిఫ్టీ  

అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధభయాలు మళ్లీ చెలరేగడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,600 పాయింట్ల వద్దకు చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు త్వరలో ఒక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలను ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తుంచేశారు.  చైనా వస్తువులపై సుంకాలు విధిస్తామని అకస్మాత్తుగా ఆయన ట్వీట్‌ చేయడం ప్రపంచ మార్కెట్లను నష్టాల పాలు చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 363 పాయింట్లు పతనమై, 38,600 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి.  

సేవల రంగం మంద వృద్ధి 
ఈ ఏడాది ఏప్రిల్‌లో నికాయ్‌ మార్కెట్‌ సర్వీసెస్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ 51కు పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఇది 52గా ఉంది. గడిచిన ఏడు నెలల కాలంలో సేవల రంగంలో ఇదే అత్యంత మందగమన వృద్ధి. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ వ్యాపార, విస్తరణ ప్రణాళికలను పలు కంపెనీలు వాయిదా వేయడంతో ఈ మందగమనం చోటు చేసుకుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీన పడింది.   డాలర్‌తో రూపాయి మారకం 18 పైసలు తగ్గి 69.40 వద్ద ముగిసింది. ఇటీవల జోరుగా వస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం గండి కొట్టగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ అంశాలన్నీ  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు భారీగా తగ్గినా స్టాక్‌ సూచీల పతనం ఆగలేదు.   

భారీ నష్టాలతో ఆరంభం... 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య సుంకాల పెంపు ట్వీట్‌ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో మన స్టాక్‌ మార్కెట్‌ కూడా భారీ నష్టాలతోనే ఆరంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 244 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యలో ఈ నష్టాలు ఒకింత తగ్గినా, రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 453 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల వరకూ నష్టపోయాయి.   

మరిన్ని విశేషాలు... 
►స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.25 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.25 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.150.37 లక్షల కోట్లకు చేరింది.  
►    మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీలు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి.  
►   వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను తగ్గించడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 5.3 శాతం నష్టంతో రూ.166 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,135 కోట్లు తగ్గి రూ.38,516 కోట్లకు పడిపోయింది. ఈ బ్యాంక్‌ లాంగ్‌టర్మ్‌ రేటింగ్స్‌ను దేశీయ రేటింగ్‌ సంస్థ, ఇక్రా తగ్గించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  
►    మెరియా ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ 14 పరిశీలనలను వెల్లడించడంతో క్యాడిలా హెల్త్‌కేర్‌ షేర్‌ తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.292కు పడిపోయింది. చివరకు 1 శాతం లాభంతో 308 వద్ద ముగిసింది. 
►   టాటా స్టీల్‌ షేర్‌ 2.2 శాతం నష్టంతో రూ.535 వద్ద ముగిసింది. టాటా స్టీల్, థిసన్‌క్రప్‌ల జాయింట్‌ వెంచర్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల కారణంగా  ఈ షేర్‌ నష్టపోయింది.
► ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లు 2% వరకూ లాభపడ్డాయి. 
► దేశీ స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ, కొన్ని షేర్లు మాత్రం ప్రతికూలతలను ఎదురీది మంచి లాభాలను నమోదుచేశాయి. మోర్పెన్‌ ల్యాబ్స్‌ షేరు ధర 20 శాతం, టాటా కెమికల్స్‌ షేర్‌ 8 శాతం. అలెంబిక్‌ ఫార్మా 3 శాతం చొప్పున ఎగబాకాయి. 

ట్రంప్‌ ట్వీట్‌తో పతనమైన ప్రపంచ మార్కెట్లు 
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం జరుగుతున్న చర్చల్లో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో చర్చలు నత్త నడకన నడుస్తున్నాయని, 20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న సుంకాలను  25 శాతానికి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ట్వీట్‌ చేయడంతో సోమవారం ప్రపంప మార్కెట్లు అతలాకుతలమయ్యాయి.  కాగా వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఈ బుధవారం చర్చల నిమిత్తం చైనా అధికారులు వాషింగ్టన్‌కు రానున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో ఈ చర్చలను రద్దు చేసుకోవాలని చైనా ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఒత్తిడిలో చర్చలు జరపలేమని చైనా అధికారులు వ్యాఖ్యానించడంతో నష్టాలు మరింత పెరిగాయి.  చైనాకు చెందిన షాంఘై సూచీ 5.5 శాతం,  హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 3 శాతం, కొరియా కోస్పీ 1 శాతం రేంజ్‌లో పడిపోయాయి. పిల్లల దినోత్సవం  కారణంగా జపాన్‌ స్టాక్‌ మార్కెట్‌ పనిచేయలేదు. అయితే నికాయ్‌ 225 సూచీ ఫ్యూచర్స్‌ 2 శాతం నష్టపోయింది. చైనా స్టాక్‌ మార్కెట్‌ మూడేళ్ల కనిష్టానికి చేరింది. ఇక అమెరికాకు చెందిన డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ సూచీ ఫ్యూచర్స్‌ 1.7 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఫ్యూచర్స్‌ 1.6 శాతం వరకూ కుదేలయ్యాయి. ఆరంభంలోనే యూరప్‌ మార్కెట్లు 2 శాతం మేర నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు