పార్లమెంటు ముందుకు  ఆధార్‌ చట్ట సవరణ బిల్లు 

3 Jan, 2019 01:48 IST|Sakshi

న్యూఢిల్లీ: బయోమెట్రిక్‌ ఐడీ ఆధార్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బ్యాంక్‌ ఖాతా, మొబైల్‌ కనెక్షన్లు మొదలైనవి పొందడానికి వినియోగదారులు గుర్తింపు ధృవీకరణ పత్రం కింద ఆధార్‌ను స్వచ్ఛందంగా మాత్రమే ఇచ్చేలా ఇందులో ప్రతిపాదనలున్నాయి. ఆధార్‌ ఇవ్వడానికి ఇష్టపడని వారికి బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డులు మొదలైన సర్వీసులు అందించకుండా ఆయా సంస్థలు నిరాకరించడానికి ఉండదు. స్వచ్ఛందంగా ఆధార్‌ నంబర్‌ ఇచ్చిన వారి బయోమెట్రిక్‌ వివరాలను సర్వీస్‌ ప్రొవైడర్లు తమ సర్వర్లలో భద్రపర్చుకోరాదు. అలాగే, ఆధార్‌ను దుర్వినియోగం చేసే కంపెనీలపై రూ.1 కోటిదాకా జరిమానా, నిబంధనలు ఉల్లంఘన జరిగినంత కాలం రోజుకు రూ.10 లక్షల దాకా అదనంగా పెనాల్టీ విధించేందుకు యూఐడీఏఐకి అధికారాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ప్రయోజనాల కోసం ఈ బిల్లు కింద ఆధార్‌ చట్టం 2016తో పాటు ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం 2002ని కూడా సవరించనున్నారు. 

మరిన్ని వార్తలు