ఎల్‌ఐసీ పాలసీకి ఆధార్‌ లింక్‌ : అలా చేయకండి

1 Dec, 2017 09:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు, మీ ఎల్‌ఐసీ పాలసీలకు లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దేశంలోనే అతిపెద్ద లైఫ్‌ ఇన్సూరర్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. పాలసీ హోల్డర్స్‌ తమ పాలసీలకు ఆధార్‌ లింక్‌ చేసుకోవడం కోసం ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. కానీ ఇటీవల ఎస్ఎంఎస్‌ను పంపించి.. ఆధార్‌తో ఎల్ఐసీ పాలసీని లింక్ చేసుకోవాలంటూ ఎల్‌ఐసీ పేరు మీద బూటకపు మెసేజ్‌లు వస్తున్నాయి. అలా వచ్చిన మెసేజ్‌ను నమ్మి, నిజంగా ఎస్‌ఎంఎస్‌తో ఆధార్‌ను లింక్‌ చేస్తే ఇక పాలసీదారుడి పని అంతేనని, వివరాలన్నీ లీకైపోతాయని ఎల్‌ఐసీ ప్రకటించింది. అలాంటి లింకుల మెసేజీల‌ను న‌మ్మొద్దంటూ ఎల్ఐసీ సంస్థ తన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది. సోషల్‌మీడియాలో విస్తృతంగా వస్తున్న ఆ స‌మాచారాన్ని, ప్రచారాన్ని నమ్మొద్దని, తాము అలాంటి ఎస్ఎంఎస్‌ల‌ను పంపించ‌ట్లేద‌నీ స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఆన్‌లైన్‌ విధానం ద్వారానే పాలసీలను పాన్‌, ఆధార్‌తో లింక్‌ చేసుకునే ప్రక్రియను చేపడుతున్నామని ఎల్‌ఐసీ తెలిపింది. 

  • ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఎల్‌ఐసీ పాలసీల వివరాలు దగ్గర పెట్టుకోవాలి
  • ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. హోమ్‌పేజీలో కనిపిస్తున్న ఆధార్‌, పాన్‌ను ఎల్‌ఐసీ పాలసీలతో అనుసంధానించుకునే లింక్‌ను క్లిక్‌ చేయాలి.
  • యూఐడీఏఐ వద్ద రిజిస్ట్రర్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ను నమోదుచేసుకోవాలి. మీరు నమోదుచేసిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఒకవేళ ఆధార్‌లో మీ మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేసుకుని లేకపోతే, దగ్గర్లోని ఎల్‌ఐసీ బ్రాంచు ఆఫీసును సంప్రదించి, ఆధార్‌ లింక్‌ను చేపట్టవలసి ఉంటుంది. 
  • చెక్‌లిస్టులన్నీ చదివాక, పేజీ కింద ఉన్న ప్రొసీడ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
  • దరఖాస్తులో అన్ని వివరాలు నింపిన అనంతరం, ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ విజయవంతమైనట్టు ఓ మెసేజ్‌ వస్తుంది.
మరిన్ని వార్తలు