ఆధార్‌పై ఆర్‌బీఐ సంచలన రిపోర్టు

9 Jan, 2018 14:58 IST|Sakshi

ముంబై : ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు, ఇన్సూరెన్స్‌ పాలసీలు, మొబైల్‌ సేవల వరకు  అన్ని సేవలకు ప్రస్తుతం ఆధార్‌ను అనుసంధానం చేస్తూ వెళ్తున్నారు. కానీ ఈ ఆధార్‌ ఎంతవరకు భద్రం అంటే మాత్రం? అది ప్రశ్నార్థకమే. ఆధార్‌ భద్రతపై ఇటీవల పలు సంచలన రిపోర్టులు వెలువడుతున్నాయి.  ఓ వైపు  ఆధార్‌ డేటా చాలా భద్రమంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్నా.. కేవలం రూ.500కే ఈ డేటా ఆన్‌లైన్‌లో లభ్యమవుతుందంటూ వస్తు‍న్న రిపోర్టులు ప్రజలను, నిపుణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కేవలం ప్రైవేట్‌ అధ్యయనాలు మాత్రమే కాక, ఆర్‌బీఐ రీసెర్చర్లు కూడా ఆధార్ డేటా భద్రతపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ తమ రీసెర్చ్‌ పత్రాన్ని విడుదల చేశారు. 

ఆర్‌బీఐకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌, రీసెర్చ్‌ ఇన్‌ బ్యాకింగ్‌ టెక్నాలజీ సమర్పించిన రీసెర్చ్‌ పేపర్‌ ఆధార్‌పై తీవ్రమైన భద్రతా సమస్యలను ఎలుగెత్తి చూపింది. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఆధార్‌ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, దీనిలో యూఐడీఏఐ ప్రధానమైన సవాల్‌ తన ఆధీనంలో ఉన్న డేటాను భద్రపరచడమని పేర్కొంది. తొలిసారి సైబర్‌ క్రిమినల్స్‌కూ, భారత వెలుపలి శత్రువులకు సింగిల్‌ టార్గెట్‌గా ఆధార్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. యూఏడీఏఐపై ఒక్క అటాక్‌చేస్తే చాలు, దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం కానుందని,  సిటిజన్ల గోప్యత అంతా ఒక్కసారిగా బహిర్గతం కానుందని ఆర్‌బీఐ రీసెర్చర్ల పేపర్‌ హెచ్చరించింది. ఆధార్‌ వివరాలు బయటికి వస్తే, ఏ మేర నష్టం వాటిల్లుతుందో కూడా ఊహించలేమని పేర్కొంది.

బయోమెట్రిక్‌ వివరాలే ప్రస్తుతం దేశీయ ముఖ్యమైన ఆస్తిగా ఆర్‌బీఐ రీసెర్చర్లు​ అభివర్ణించారు.  చాలా లావాదేవీలకు ప్రస్తుతం ఆధార్‌ అవసరం ఏర్పడిందని, పెద్ద మొత్తంలో సర్వీసు ప్రొవైడర్ల డేటా బేస్‌ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఏమైనా ఉల్లంఘన జరిగితే ఈ సమాచారమంతటన్నీ సైబర్‌ క్రిమినల్స్‌కు వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో సేకరిస్తున్న ఆధార్‌ డేటాను ఏ మేర దుర్వినియోగ పరుచుకోవచ్చో తెలుపుతూ ఆర్‌బీఐ రీసెర్చర్లు ఈ అధ్యయన రిపోర్టును విడుదల చేశారు.

మరిన్ని వార్తలు