ఆధార్‌ గోప్యతపై స్నోడెన్‌ సంచలన వ్యాఖ్యలు

5 Jan, 2018 17:16 IST|Sakshi

ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. రోజుకో సంచలన నివేదికలు బహిర్గతం కావడం దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్‌ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్‌ చేయడం చాలా సులువని శుక్రవారం వెల్లడించారు.

అమెరికా సెక్యూర్టీకి చెందిన అనేక రహస్య పత్రాలను బయటపెట్టిన స్నోడెన్ వ్యాఖ్య ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశం పరిచయం చేసిన ఆధార్‌ డేటాబేస్‌ అక్రమ వినియోగానికి, (మిస్‌ యూజ్‌, అబ్యూజ్‌) అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి , విజిల్‌ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు. చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందన్నారు. భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్‌ విలేఖరి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఆధార్‌ డేటా సెక్యూరిటీ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో ఆధార్‌ డేటా గోప్యత చర్చనీయాంశమైనంది. దీనిపై సుప్రీంకోర్టులో నిర్ణయం కూడా పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే కేవలం రూ.500 లకే ఆధార్‌ కార్డు వివరాలు లభ్యం అంటూ వచ్చిన నివేదికలు మరింత కలవరం పుట్టించాయి. ఇటీవల ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలాసులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందని ఆ పత్రిక  బుధవారం ఒక కథనంలో పేర్కొన్నది. దీన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు