ఆధార్‌ వర్చువల్‌ ఐడీకి గడువు పెంపు

1 Jun, 2018 00:53 IST|Sakshi

జూలై 1 వరకు పొడిగింపు

యూఐడీఏఐ నిర్ణయం 

న్యూఢిల్లీ: ఆధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ తాజాగా వర్చువల్‌ ఐడీలకు గడువు పొడిగించింది. వర్చువల్‌ ఐడీ వ్యవస్థ అమలుకు సర్వీస్‌ ప్రొవైడర్లు, బ్యాంకులు, టెలికం కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు జూలై 1 వరకు సమయమిచ్చింది. ఆధార్‌ నెంబర్‌ భద్రతపై పలు సందేహాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అందుకే యూఐడీఏఐ జనవరిలో వర్చువల్‌ ఐడీ సిస్టమ్‌ అనే ఆలోచనను ఆవిష్కరించింది. దీనికి సంబంధించి ఏప్రిల్‌లో బీటా వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. వర్చువల్‌ ఐడీ సిస్టమ్‌ విధానంలో అథంటికేషన్, వెరిఫికేషన్‌ సమయంలో ఆధార్‌ నెంబర్‌ తెలియజేయాల్సిన అవసరం లేదు. దీనికి బదులు వర్చువల్‌ ఐడీ ఇస్తే సరిపోతుంది. కాగా అన్ని ఏజెన్సీలు వారి యూజర్ల అథంటికేషన్‌ కోసం 2018 జూన్‌ 1 నుంచి వర్చువల్‌ ఐడీలను అంగీకరించాలని యూఐడీఏఐ గతంలోనే ఆదేశించింది.

అయితే కొత్త వ్యవస్థ అమలుకు తమకు మరికొంత సమయం కావాలని ఏజెన్సీలు కోరడంతో యూఐడీఏఐ తన గడువును తాజాగా మరో నెలపాటు పొడిగించింది. ‘మేం సిద్ధంగా ఉన్నాం. అయితే ఏజెన్సీలు వర్చువల్‌ ఐడీ సిస్టమ్‌కు మారడానికి మరికొంత సమయం కోరుతున్నాయి. అందుకే వాటికి మరో నెల సమయమిచ్చాం’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. మనం ఇ–ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. దానిలో వర్చువల్‌ ఐడీ కూడా వస్తుందని వర్చువల్‌ ఐడీ వ్యవస్థతో సంబంధమున్న ఒక అధికారి తెలిపారు. కాగా వర్చువల్‌ ఐడీలో 16 సంఖ్యలుంటాయి. ఒక వ్యక్తి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఐడీలను జనరేట్‌ చేసుకోవచ్చు. కొత్త ఐడీ క్రియేట్‌ అయిన ప్రతిసారి పాత ఐడీ ఆటోమేటిక్‌గా రద్దువుతుంది.  

బ్యాంకులకు ఊరట.. 
మరోవైపు యూఐడీఏఐ రోజుకు కనీసం ఇన్ని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్లు/అప్‌డేషన్లు చేయాలంటూ బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్‌ బ్రాంచ్‌లు 2018 జూలై 1 నుంచి రోజుకు 8 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్లు  చేయాలని పేర్కొంది. కాగా ఇదివరకు బ్యాంక్‌ బ్రాంచ్‌లు రోజుకు 16 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్లను చేయాల్సి ఉండేది.   

>
మరిన్ని వార్తలు