ఖాతా ప్రారంభానికి ఆధార్‌ తప్పనిసరి కాదు: ఎస్‌బీఐ

27 Sep, 2018 01:22 IST|Sakshi

న్యూఢిల్లీ:  సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకా రం బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని, అయితే.. ఖాతాదారులు స్వచ్ఛందంగా ఆధార్‌ సమర్పించవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆధార్‌ స్కీంను గొప్ప సౌలభ్యతగా అభివర్ణించిన ఆయన.. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ‘ఆన్‌లైన్‌ ద్వారా కేవలం 5 నిమి షాల్లోనే ఖాతా ప్రారంభమవడమే కాకుండా, తక్షణ నిర్వహణ సౌకర్యం అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం ఆధార్‌. 80–85 శాతం బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయి. యోనో ప్లాట్‌ఫామ్‌ ద్వారా రోజుకు 27,000 డిజిటల్‌ అకౌంట్లు ప్రారంభమవుతున్నాయి.’ అని వివరించారు.  

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నుంచి  ‘నిధుల’ ప్రతిపాదన లేదు
కాగా సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి అదనపు నిధులు కావాలంటూ ఎటువంటి నిర్మాణాత్మక ప్రతిపాదన తమకు రాలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఎస్‌బీఐకి 6.42 శాతం వాటా ఉంది. పలు డెట్‌ చెల్లింపుల్లో ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూపునకు మొత్తం రూ.91,000 కోట్ల రుణ భారం ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి నిర్మాణాత్మక ప్రతిపాదన తమ ముందుకు వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని  చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. అపోలో హాస్పిటల్స్‌తో కలసి ఎస్‌బీఐ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించిన అనంతరం రజనీష్‌ ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందించారు.  

>
మరిన్ని వార్తలు