ఆర్తి ఇండస్ట్రీస్‌ పతనం- జూబిలెంట్‌ జోరు

15 Jun, 2020 12:36 IST|Sakshi

కాంట్రాక్ట్‌ రద్దు వార్తలతో ఆర్తి వీక్‌

7 శాతం పతనమైన షేరు

జూబిలెంట్‌ లైఫ్‌ నిధుల సమీకరణ

7 శాతం జంప్‌చేసిన షేరు

కరోనా వైరస్‌ రెండో దశ తలెత్తనున్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తలెత్తుతున్నాయి. దీంతో ముడిచమురు ధరలు పతనంకాగా.. యూఎస్‌ మార్కెట్ల ఫ్యూచర్స్‌ నష్టాలలోకి ప్రవేశించాయి. దేశీయంగానూ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 779 పాయింట్లు పడిపోయి 33,001కు చేరగా.. నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 9,762 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెమ్‌డెసివిర్‌ ఔషధ లైసెన్సింగ్‌తోపాటు.. తాజాగా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోపక్క దీర్ఘకాలిక కాంట్రాక్టు రద్దయిన వార్తలతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
కోవిడ్‌-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న రెమ్‌డెసివిర్‌ ఔషధానికి సంబంధించి యూఎస్‌ దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ ఇంక్‌ నుంచి నాన్‌ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 637 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. కంపెనీ తాజాగా స్వల్పకాలిక రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 50 కోట్లను సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 2307 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 260 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.68% వాటా ఉంది. గతేడాది పెట్టుబడి వ్యయాలపై రూ. 516 కోట్లను వెచ్చించింది. అంతేకాకుండా రూ. 514 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠీ తెలియజేసింది. మధ్య, దీర​‍్ఘకాలాలకు జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌పట్ల సానుకూల ధృక్పథంతో ఉన్నట్లు పేర్కొంది. కాగా.. జూబిలెంట్‌ లైఫ్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం ఊపందుకుంది. తొలి గంటన్నర సమయంలోనే ఈ కౌంటర్లో 12.73 లక్షల షేర్లు చేతులు మారినట్లు బీఎస్‌ఈ డేటా వెల్లడించింది.

ఆర్తి ఇండస్ట్రీస్‌
గ్లోబల్‌ ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ నుంచి గతంలో దక్కించుకున్న 10ఏళ్ల కాంట్రాక్టును గడువుకంటే ముందుగానే ఆ సంస్థ రద్దు చేసుకుంటున్నట్లు ఆర్తి ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. 2017 జూన్‌లో కుదుర్చుకున్న కాంట్రాక్టులో భాగంగా హెర్బిసైడ్స్‌లో వినియోగించగల ఆగ్రోకెమికల్‌ ఇంట‍ర్మీడియరీ సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే కంపెనీ ప్రొడక్ట్‌ తయారీ వ్యూహాన్ని మార్చుకోవడం ద్వారా కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో 12-13 కోట్ల డాలర్లస్థాయిలో నష్టపరిహారం లభించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం పతనమై రూ. 852 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 29 శాతం తిరోగమించడం గమనార్హం! 

మరిన్ని వార్తలు