భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ

26 Jun, 2019 11:32 IST|Sakshi
(మీడియా సమావేశంలో అమిత్, ప్రకాశ్‌ (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పానీయాల ప్యాకేజింగ్‌కు అల్యూమినియం క్యాన్లను వాడటం పెరుగుతోందని అల్యూమినియం బెవరేజెస్‌ క్యాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఏఐ) స్పష్టంచేసింది. కల్తీకి ఆస్కారం లేకపోవడం, పానీయాల జీవిత కాలం ఎక్కువ ఉండడం, ప్లాస్టిక్‌ పట్ల విముఖత ఇందుకు కారణమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా అల్యూమినియంతో తయారైన 200 కోట్ల పానీయాల క్యాన్లు విక్రయం అవుతున్నాయని బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ ఇండియా ఎండీ అమిత్‌ లహోటి తెలిపారు.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ కన్సూ్యమర్‌ ఇన్‌సైట్స్, బ్రాండ్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ హెడ్‌ ప్రకాశ్‌ నెడుంగడితో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఏటా అల్యూమినియం క్యాన్ల వినియోగం వృద్ధి రేటు 9–10% ఉంటోంది. ఈ క్యాన్లలో 50–60% బీర్ల ప్యాకేజింగ్‌కు, మిగిలినవి ఇతర పానీయాల కోసం వాడుతున్నారు. గ్లాస్‌ ప్యాకేజింగ్‌ నుం చి పరిశ్రమ ఎక్కువగా అల్యూమినియం వైపు మళ్లుతోంది’ అని వివరించారు. బాల్‌ బెవరేజ్‌కు మహారాష్ట్రలోని తలోజ, ఏపీలోని శ్రీసిటీలో తయారీ కేంద్రాలున్నాయి. భవిష్యత్‌లో డిమాండ్‌ పెరిగితే హైదరాబాద్‌లో క్యాన్ల తయారీ ప్లాంటు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని అమిత్‌ వెల్లడించారు. 1880లో ప్రారంభమైన బాల్‌ కార్పొరేషన్‌ ఏటా 10,000 కోట్ల క్యాన్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు