ఏసీ, ఫ్రిజ్‌ ధరలకు రెక్కలు!!

5 Jun, 2018 00:28 IST|Sakshi

ఇతర వంటింటి ఉపకరణాలదీ అదే బాట

ఈ నెల్లో 2– 5 శాతం మేర పెరిగే అవకాశం

ముడి చమురు సహా పలు ముడి పదార్థాల ధరల పెరుగుదల

దీనికి ఆజ్యం పోసిన రూపాయి క్షీణత

జనవరి నుంచి రూపాయి 7 శాతం డౌన్‌

దీంతో కంపెనీలపై ఒత్తిడి పెరిగిందంటున్న పరిశ్రమ నిపుణులు  

ఏసీ, వాషింగ్‌ మెషీన్, రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిజ్‌), మైక్రోవేవ్, ఇతర వంటింటి ఉపకరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ఈ నెల్లో వీటి ధరలు 2–5 శాతంమేర పెరిగే అవకాశముంది. రూపాయి మారకం విలువ క్షీణించడం.. క్రూడ్‌ ధరల్లో పెరుగుదల.. స్టీల్, కాపర్‌ వంటి కీలకమైన ముడిపదార్థాల ధరలు ఎగబాకటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

రూ.400–రూ.1,500 శ్రేణిలో పెంపు..
ప్రీమియం మోడళ్ల ధరల పెరుగుదల నికరంగా రూ.400 నుంచి రూ.1,500 శ్రేణిలో ఉండొచ్చని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్స్‌ చెప్పారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల కారణంగా మార్చి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అందువల్ల డిమాండ్‌ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాయి. ‘జూన్‌ నుంచి ధరల పెంపు దశల వారీగా ఉంటుంది.

ఇక్కడ కస్టమర్ల సెంటిమెంట్‌ దెబ్బ తినకుండా చూసుకోవడం ప్రధానం. కొత్త సరుకు మార్కెట్లోకి రావడం కూడా పెంపునకు మరో  కారణం’ అని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది చెప్పారు. ప్రస్తుతమున్న పాత సరుకు వల్ల పరిశ్రమ గత రెండు నెలల నుంచి ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తోందని పేర్కొన్నారు.

గోద్రెజ్‌ 2–3 శాతం శ్రేణిలో ధరలను పెంచనుంది. దేశీ అతిపెద్ద ఎయిర్‌ కండీషనర్‌ తయారీ సంస్థ వోల్టాస్‌ తాజాగా ధరలను దాదాపు 3 శాతంమేర పెంచింది. వర్ల్‌పూల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ డిసౌజా మాట్లాడుతూ.. పరిశ్రమ చర్యల ఆధారంగా తాము కూడా ధరలను పెంచొచ్చని తెలిపారు. అయితే ఎంతమేర పెంపు ఉంటుందనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఎల్‌జీ, శాంసంగ్‌ ప్రొడక్టుల ధరలు 5% జంప్‌?
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ, శాంసంగ్‌ కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను 5 శాతం మేర పెంచే అవకాశముంది. ఈ అంశాన్ని ఇప్పటికే తమ ట్రేడర్లకు ఇవి తెలియజేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఈ సంస్థలు అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఏమీ చెప్పలేదు. ధరల పెంపు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రమోషనల్‌ ఆఫర్లను అందించే ప్రయత్నం చేస్తున్నామని వోల్టాస్‌ ఎండీ ప్రదీప్‌ బక్షి తెలిపారు.

పానాసోనిక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ఒత్తిడి బాగా పెరిగింది. కాబట్టి ధరలను ఎప్పట్లానే కొనసాగించలేం. రూపాయి మారకం విలువలో మళ్లీ క్షీణత మొదలైనా.. ఉత్పత్తి వ్యయాల పెరిగినా.. అప్పుడు ధరల పెంపు అనివార్యమవుతుంది’’ అని వివరించారు.


రూపాయి దెబ్బ
పరిశ్రమ తన ధరల వ్యూహాలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను 66 వద్ద బెంచ్‌మార్క్‌గా నిర్దేశించుకుంటుంది. కానీ ఇప్పుడు రూపాయి 67కు పైనే ఉంది. జనవరి నుంచి చూస్తే డాలర్‌తో రూపాయి 7%మేర క్షీణించింది. ప్రస్తుతం రూపాయి విలువ 67.11గా ఉంది. ఇక స్టీల్‌ ధరలు 7–8% పెరిగాయి. కాపర్‌ ధరలూ పెరిగాయి.

‘‘కాపర్‌ను ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని రసాయనాల ధరలు తగ్గడం కొంత ఉపశమనం. దీనివల్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. అయితే ఇది ఎక్కువ రోజులు సాధ్యపడదు’’ అని పలువురు ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. మరొకవైపు ధరల పెంపుపై రిటైలర్లు మిశ్రమంగా స్పందించారు.

మరిన్ని వార్తలు