ఏసీసీ-అంబుజా మెర్జర్‌కు బ్రేక్‌: షేర్ల పతనం

27 Feb, 2018 10:11 IST|Sakshi

సాక్షి, ముంబై:  సిమెంట్‌ రంగ దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజా మధ్య విలీనాకి చెక్‌ పడిందన్న వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో  ఈ  రెండు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా అంబుజా 4శాతం, ఏసీసీ2 శాతం నష్టపోయాయి. విలీనం చర్చలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఇరు కంపెనీలూ  స్టాక్ ఎక్స్చేంజెస్‌కు అందించిన సమాచారంలో వెల్లడించాయి.  సంస్థ  ప్రత్యేక కమిటీ,  బోర్డు డైరెక్టర్లు రెండింటి ద్వారా జరిపిన సమగ్ర పరిశీలన ఆధారంగా  ప్రస్తుతం ఈ విలీనం అమలులో కొన్ని పరిమితులు ఉన్నాయని  అభిప్రాయపడినట్టు ఏసీసీ  తెలిపింది. కానీ  భారతదేశం  రెండవ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థను సృష్టించాలనేదే తమ "అంతిమ లక్ష్యం"  మని ఏసీసీ, అంబూజా  పేర్కొన్నాయి.

మైనింగ్‌ ఆస్తుల బదిలీకి సమస్యలు ఎదురుకావడంతో ప్రస్తుతానికి ఏసీసీ లిమిటెడ్‌, అంబుజా సిమెంట్‌ విలీనానికి తెరపడినట్లు తెలుస్తోంది. 18-20 రాష్ట్రాలలో మైనింగ్‌ ఆస్తుల హక్కుల బదిలీకి సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చని విలీన కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలూ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పరస్పరం సహకరించుకోనున్నట్లు పరిశ్రమవర్గాల  సమాచారం. 

కాగా సిమెంట్‌ రంగంలో ఇటీవల కీలక విలీనాలకు  అడుగులు పడుతున్నాయి. గతేడాది మే నెలలో ఏసీపీ, అంబుజా విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బినాని సిమెంట్‌ను విలీనం చేసుకునేందుకు  అల్ట్రా టెక్‌ సిమెంట్‌   ప్రయత్నిస్తోంది.
 

>
మరిన్ని వార్తలు