ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ విలీనం !

7 Feb, 2017 01:10 IST|Sakshi
ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ విలీనం !

ఈ ఏడాది ఉండొచ్చని వార్తలు
ముంబై: అంబుజా సిమెంట్స్, ఏసీసీ... ఈ రెండు కంపెనీలు విలీనం కానున్నాయని సమాచారం. ఈ రెండు కంపెనీల మాతృ కంపెనీ లఫార్జే హోల్సిమ్‌  ఈ దిశగా యోచిస్తోందని ఒక ప్రముఖ బిజినెస్‌ వార్తా చానెల్‌ పేర్కొంది.  స్విట్జర్లాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లఫార్జే హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్స్‌లో 63%, ఏసీసీలో 50.05 శాతం చొప్పున వాటాలున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఏడాదే ఈ విలీనం ఉండొచ్చని అంచనా.

ఏసీసీకే ప్రయోజనం..
ఈ రెండు కంపెనీల విలీన యోచన 2013 నుంచే  వార్తల్లో నలుగుతోంది. ఏసీసీ ఇబిటా టన్నుకు రూ.300 ఉండగా, అంబుజా సిమెంట్స్‌ ఇబిటా టన్నుకు రూ.800గా ఉంది. ఒక వేళ విలీనం జరిగితే ఏసీసీ కంపెనీకి బాగా ప్రయోజనం కలుగుతుంది. ఈ విలీనం వల్ల ఉత్పత్తి వ్యయాలు కలిసివస్తాయని రెలిగేర్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌కు చెందిన నవీన్‌ సహదేవ్‌ చెప్పారు.  వ్యయాలు, బ్రాండింగ్, రవాణా, పంపిణి, పన్ను ఆదాల పరంగా చూస్తే, ఈ విలీనం సమంజసమేనని మరో నిపుణులు రాకేశ్‌ అరోరా పేర్కొన్నారు. హోల్సిమ్‌ లఫార్జేకు ఒక్క భారత్‌లోనే రెండు, మూడు కంపెనీలు ఉండడం అర్థం లేనిదని వ్యాఖ్యానించారు. అయితే విలీనం బలపడటానికి కాకుండా, బలహీనతకే దారితీస్తుందని ఐకాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌కు చెందిన అనిల్‌ సింఘ్వి చెప్పారు.

స్టాక్‌ మార్కెట్‌ పరంగా చూస్తే ఇది ఏమీ ఉత్సుకత కలిగించే విషయం కాదని పేర్కొన్నారు. ఈ విలీనం ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని, ఈ కాలంలో ఈ కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను కోల్పోయాయని వివరించారు. వృద్ధి, ఇబిటా మార్జిన్లు తదితర అంశాల్లో ఈ రెండు కంపెనీలు వెనకబడే ఉన్నాయని వివరించారు. కాగా ఈ విలీన వార్తలతో రెండు కంపెనీల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈలో ఏసీసీ షేర్‌ 4 శాతం లాభంతో రూ.1,480 వద్ద, అంబుజా సిమెంట్స్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.240 వద్ద ముగిశాయి.  అయితే  విలీన వార్తల్ని సంబంధిత కంపెనీలు ధృవీకరించలేదు. ఈ ఊహాజనిత వార్తలపై  వ్యాఖ్యానించబోమని లఫార్జేహోల్సిమ్‌ స్పష్టం చేసింది. మరోవైపు  మాతృ కంపెనీ నుంచి విలీనం విషయమై తమకెలాంటి సమాచారం లేదని అంబుజా సిమెంట్స్‌ పేర్కొంది. విలీన ప్రతిపాదన ఏదీ లేదని ఏసీసీ తెలిపింది.

మరిన్ని వార్తలు