ఏసీసీ లాభం రెట్టింపు

9 Feb, 2018 00:38 IST|Sakshi

న్యూఢిల్లీ: సిమెంటు తయారీ దిగ్గజం ఏసీసీ నికర లాభం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో రెట్టింపయి రూ.206 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.91 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ.3,102 కోట్ల నుంచి రూ.3,540 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.15 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.

ప్రీమియం ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టడం, ఆదాయాలు మెరుగుపడటం తదితర అంశాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయని సంస్థ సీఈవో నీరజ్‌ అఖోరి తెలిపారు. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా అభివృద్ధి, స్మార్ట్‌ సిటీలు, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో సిమెంటు రంగానికి ఈ ఏడాది మరింత మెరుగ్గానే ఉండగలదని నీరజ్‌ తెలిపారు. బీఎస్‌ఈలో ఏసీసీ షేరు ధర 7% పెరిగి రూ. 1,692 వద్ద క్లోజయ్యింది.

>
మరిన్ని వార్తలు