ఇన్ఫీ వ్యవస్థాపకులు వాటాలను అమ్మేస్తే..పరిస్థితేమిటి?

10 Jun, 2017 14:07 IST|Sakshi
ఇన్ఫీ వ్యవస్థాపకులు వాటాలను అమ్మేస్తే..పరిస్థితేమిటి?
వేతన ప్యాకేజీ విషయంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో గతకొంతకాలంగా సాగిన అలజడి తెలిసిందే. ఈ అలజడి కొంత సద్దుమణిగింది అనగానే, మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బోర్డు సభ్యులతో పొంతన కుదరని కంపెనీ వ్యవస్థాపకులు, పూర్తిగా ఇన్ఫోసిస్ తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయిస్తున్నారని, వారి 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను అమ్మేస్తున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుతానికైతే ఆ వార్తలను ఇరువైపుల నుంచి అంటే ఇన్ఫోసిస్ కంపెనీ, వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే పరిస్థితేమిటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
ఇప్పటికే వ్యవస్థాపకులు స్టేక్ ను అమ్మేయబోతున్నారని తెలియగానే కంపెనీ షేర్లు ఢమాల్ మన్నాయి. నిన్న ప్రారంభ ట్రేడింగ్ లో 3.5 శాతం మేర పడిపోయిన షేర్లు, అనంతరం కొంత కోలుకున్నాయి. 1 శాతం నష్టంలో 948.65 వద్ద ముగిశాయి. కంపెనీ పరంగా చూసుకుంటే ఈ రూమర్లు అత్యంత కష్టకాలంలో వచ్చినట్టే తెలిసింది. అసలకే ఐటీ రంగం తీవ్ర  ఒత్తిడికి లోనవుతోంది.  ఓ వైపు నుంచి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, మరోవైపు నుంచి ఆటోమేషన్ వంటి ప్రభావాలతో ఐటీ రంగ షేర్లు గత కొంత కాలంగా అస్థిరంగా ట్రేడవుతున్నాయి.  ఒకవేళ ఇది నిజమైతే, ఈ కంపెనీ షేరు ధర మరింత పడిపోయేదని అంబిట్ కాపిటల్ అనాలిస్ట్ సాగర్ రస్తోగి చెప్పారు.
 
ఎంతో గౌరవప్రదయమైన వ్యక్తులు, వినమ్రతతో నడుచుకునే ఫౌండర్లు ఈ నిర్ణయం తీసుకుంటే షేర్ హోల్డర్స్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసేదని అనాలిస్టులంటున్నారు. అయితే దీర్ఘకాలంగా కొంత ప్రయోజనం కూడా చేకూరనుందట. గతకొంతకాలంగా కంపెనీ యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు మధ్య సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడేదని పలువురంటున్నారు. వ్యవస్థాపకుల నిర్ణయంతో మేనేజ్ మెంట్ ఎక్కువగా కంపెనీపై దృష్టిసారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వ్యవస్థాపకులు వాటాను అమ్మేయనున్నట్టు వచ్చిన వార్తలు తమల్ని తీవ్రంగా బాధించాయని ఇన్ఫోసిస్ తెలిపింది.
 
మరోవైపు నుంచి వ్యవస్థాపకులు షేరును అమ్మాలనుకోవడం మరి అంత చెత్త నిర్ణయమేమి కాదని మరో ప్రముఖ ఇన్వెస్టర్ చెబుతున్నారు. అయితే ఇది దేశీయ రెండో అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్ లో కీలకమైన క్షణంగా పరిగణించారు. ఐటీ ఇండస్ట్రి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఒక్క ఇన్ఫోసిస్ లో మాత్రమే కాక, విప్రో కంపెనీపైనా ఇదే తరహాలో రూమర్లు వచ్చాయి. విప్రోలో అయితే  ఏకంగా ప్రమోటర్లు కంపెనీనే అమ్మేయాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలను విప్రో సైతం కొట్టిపారేసింది. 
 
మరిన్ని వార్తలు