నవంబరులో పెళ్లి : వెయ్యి రూపాయలతో ఎలా?

26 Sep, 2019 14:31 IST|Sakshi

పీఎంసీ  సంక్షోభం, ఖాతాదారుల అందోళన

సాక్షి, ముబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీంఎంసీ) సంక్షోభంపై ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంకు ఎండీ జాయ్ థామస్ హామీ ఇచ్చినప్పటికీ  వినియోగదారుల ఆందోళన కొనసాగుతోంది. బ్యాంకుపై ఆర్‌బీఐ విధించిన  ఆరునెలల ఆంక్షలు ఖాతాదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్‌బీఐ గుర్తించి ఒక్కో కస్టమర్‌ కేవలం రూ.1,000 మాత్రమే (సేవింగ్స్‌/కరెంటు/డిపాజిట్‌ ఖాతా)  అంటూ పరిమితి విధించిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా ఆయా ఖాతాలనుంచి వెయ్యి రూపాయలకు మించి నగదు పొందలేరన్న ఆర్‌బీఐ నిబంధన తీవ్ర ఉద్రిక‍్తతకు దారి తీసింది. ముంబైలోని  పీఎంసీ బ్యాంకు కార్యాలయం ముందు కస్టమర్లు  గురువారం ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా ఈ బ్యాంకులో ఖాతానుకొనసాగిస్తున్నానని గురు చరణ్‌సింగ్‌ తల్వార్‌ అనే ఖాతాదారుడు వాపోయాడు. బిడ్డ పెళ్లి కోసమని డబ్బులు కూడబెట్టాను. నవంబరులో పెళ్లి నిశ్చయించుకున్నాం. ఇపుడీ వెయ్యి రూపాయలతో ఎలా మేనేజ్‌ చేయలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ. నెలకు రూ. 5 వేలు సంపాదించుకునే మహిళ,  ఏం జరుగుతోందో అర్థంకాక కన్నీరు మున్నీరయ్యారు. 

మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన హెచ్‌డీఐఎల్‌, పీఎంసీ బ్యాంకు మేనేజ్‌మెంట్‌   క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌నిరుపమ్‌,  మరో బీజేపీ నేత డిమాండ్‌ చేశారు. అలాగే  నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేశారు. వెయ్యి లక్షరూపాయలకు లిమిట్‌ను పెంచాల్సిందిగా  ఆర్‌బీఐ  గవర్నర్‌ శక్తికాంత దాస్‌ను  కోరినట్టు బీజేపీ నేత తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ పీఎంసీ కుంభకోణంతో  బీజేపీనుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే సర్దార్‌ తారా సింగ్‌ కుమారుడు, బ్యాంకు కో డైరెక్టర్లలో ఒకరైన రజనీత్‌ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని ఆయన కొట్టి పారేశాడు. గత 13ఏళ్లనుంచి  మూడవసారి డైరెక్టర్‌గా కొనసాగుతున్నానని, బ్యాంకునకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం ఉండవని వివరణ ఇచ్చారు.  విత్‌ డ్రా పరిమితిని  పెంచాల్సిందిగా ఆర్‌బీఐని కోరినట్టు తెలిపారు.  

 చదవండి  : పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా!

చదవండి  : ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

మరిన్ని వార్తలు