మొబైల్ నుంచేపెట్ కి హాయ్ చెప్పండి..!

17 Sep, 2016 06:31 IST|Sakshi
మొబైల్ నుంచేపెట్ కి హాయ్ చెప్పండి..!

క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అందే ఫీడ్
ఏసర్ పాబో ప్లస్‌తో పెట్ ట్రాకింగ్
త్వరలో భారత్‌లో విడుదల

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెంపుడు జంతువునుఅన్ని సందర్భాల్లో వెంట తీసుకువెళ్లలేం. అలా అని అన్ని సమయాల్లోనూ తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంచలేం. అలాంటప్పుడు ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయినా మీ పెట్‌తో మొబైల్ నుంచే హాయ్ అంటూ మాట్లాడొచ్చు. అంతేకాదు ఆహారమూ వేయవచ్చు. పెట్‌ను ఆడించొచ్చు కూడా అని అంటోంది టెక్నాలజీ కంపెనీ ఏసర్. ఇందుకోసం పాబో ప్లస్ పేరుతో ఒక ప్రత్యేక పరికరాన్ని ఏసర్ అనుబంధ కంపెనీ అయిన పాబో రూపొందించింది.

ఆన్‌డ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ ఉంటే చాలు. నెట్ సహాయంతో పాబో ప్లస్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అనుసంధానం అవొచ్చు. ఇటీవలే బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ-2016 టెక్నాలజీ షోలో దీనిని ఆవిష్కరించారు. త్వరలో భారత్‌లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఏసర్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

పాబో ప్లస్ ఇలా పనిచేస్తుంది..
పెంపుడు జంతువును పర్యవేక్షించే పరికర మే పాబో ప్లస్. ఇది వైఫైతో పనిచేస్తుంది. మొత్తం 8 మంది కనెక్ట్ అయి లైవ్ వీడియోను చూడొచ్చు. ఇలా అనుసంధానమైన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ చేతిలోకి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా పెట్‌ను పలకరించొచ్చు. ఇందుకోసం పాబో ప్లస్‌లో స్పీకర్‌తోపాటు మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. యజమాని కనపడకపోయినా గొంతు వింటే చాలు పెంపుడు జంతువుకు ఊరట లభిస్తుందని కంపెనీ అంటోంది. దీనికి ఉన్న కెమెరాతో 130 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేయగానే ఈ పరికరం నుంచి కొంత ఫీడ్ (ఆహారం) బయటకు వస్తుంది. దీనికి ఉన్న మోటరైజ్డ్ లేజర్ పాయింట్ గేమ్‌తో పెట్‌ను ఆడించొచ్చు. భారత్‌లో పాబో ప్లస్ ధర రూ.12-15 వేలు ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,34,000 కోట్ల వ్యాపార అవకాశమని ఏసర్ చీఫ్ జేసన్ ఛెన్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో అయితే చిన్న పిల్లల సంఖ్య కంటే పెంపుడు జంతువులు రెండు రెట్లు ఉంటాయని అన్నారు.

మరిన్ని వార్తలు