45 రోజుల్లో 48వేల టవర్లు

26 Jul, 2016 01:19 IST|Sakshi
45 రోజుల్లో 48వేల టవర్లు

కాల్ డ్రాప్స్ పరిష్కారానికి ఆపరేటర్ల చర్యలు: మనోజ్ సిన్హా
వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్‌కు కొత్త బ్యాండ్లు కావాలని వినతి

 న్యూఢిల్లీ : మొబైల్ కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం కోసం రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, మరింత స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాల్ డ్రాప్స్ అంశంపై టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా సోమవారం కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 100 రోజుల్లో 60 వేల టవర్లు నిర్మిస్తామన్న హామీలో భాగంగా 45 రోజుల్లో 48వేల టవర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు సమావేశం అనంతరం మంత్రి మనోజ్ సిన్హా విలేకరులకు తెలిపారు. ఆపరేటర్ల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, ప్రభుత్వం మాత్రం వినియోగదారుల అనుభవం ఆధారంగా నెట్‌వర్క్‌ను ఇంకా పటిష్ట పరచాలని ఆశిస్తోందని చెప్పారు. కాల్ డ్రాప్స్ అంశంపై ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. జూన్‌లో జరిగిన తొలి సమావేశం సందర్భంగా నెట్‌వర్క్ పటిష్టతకు కంపెనీలు అదనపు టవర్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి.

 సెప్టెంబర్‌లో స్పెక్ట్రం వేలం
సెప్టెంబర్‌లో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, దీంతో స్పెక్టమ్ కొరత సమస్య తీరిపోతుందని ఆపరేటర్లకు మంత్రి తెలియజేశారు. అయితే, ఈ వేలంలో 71 నుంచి 76 గిగాహెడ్జ్, 50 గిగాహెడ్జ్ నూతన ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆపరేటర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బ్యాండ్లలో వైర్‌లెస్ సేవల ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ను 1 గిగాబైట్ వేగంతో అం దించడానికి వీలవుతుందని సూచించారు. తాము ఏడాదిలో లక్ష టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో నెట్‌వర్క్‌ల సామర్థ్యం పెంచుకునేందుకు గాను ఈ (71-76), వీ (50గిగాహెడ్జ్) బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ వేసేందుకు అనుమతులు కష్టంగా ఉండడంతో ఈ బ్యాండ్లు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అలాగే, స్పెక్ట్రమ్ కోసం చేసే చెల్లింపులపై వడ్డీ రేటు తక్కువగా ఉంచాలని కోరినట్టు కూడా ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు