అదానీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా డీల్‌: షేర్ల జోరు

22 Dec, 2017 12:06 IST|Sakshi

సాక్షి, ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన పవర్‌ బిజినెస్‌ విక్రయించేందుకు అదానీ ట్రాన్స్‌మిషన్‌తో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  సమీకృత ముంబై పవర్‌ బిజినెస్‌లో 100 శాతం వాటాను అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  వెల్లడించింది.   రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి రిలయన్స్ ఇన్‌ఫ్రా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మొత్తం డీల్‌ విలువ రూ. 18,800 కోట్లుకాగా... ముంబైలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా నిర్వహిస్తున్న విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్‌లు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు బదిలీకానున్నాయి. ముంబై పవర్‌ బిజినెస్‌కు 30 లక్షల మంది కస్టమర్లున్నారు. 1892 మెగావాట్ల విద్యుత్‌ పంపిణీ చేపడుతోంది. 500 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంటును కలిగి ఉంది.  ఈ డీల్ ద్వారా తమకు దక్కే మొత్తాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రా తన అప్పులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది.

రిలయన్స్‌ ఇన్‌ ఫ్రా సీఈవో  అనిల్ జలాన్ మాట్లాడుతూ ఒప్పందం ద్వారా అప్పుల తర్వాత సుమారు  రూ .3,000 కోట్ల  మిగులు వుంటుందని,  ఈ నిధులను ఇతర నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట‍్టడానికి తమకు  సహాయపడుతుందన్నారు. తద్వారా రూ. 10,000 కోట్ల ఆర్డర్ బుక్‌తో  దేశంలో రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న తమకు  చౌకైన నిధులకు సులభ ప్రాప్యతను కలిగి ఉంటామని చెప్పారు.

దీంతో శుక్రవారం నాటి మార్కెట్‌లో  ఇన్వెస్టర్లు భారీ కొనుగోల్లకు మొగ్గు చూపడంతో  రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దాదాపు 5 శాతం ఎగసింది. ఒక దశలో రూ. 545  వద్ద ట్రేడ్‌ అయింది. మరోవైపు గురువారం ఆల్‌టైం హైని తాకిన అదానీ ట్రాన్స్‌మిషన్‌ 8.5 శాతం లాభాలతో కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు