6 శాతం తగ్గిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం

14 Nov, 2017 01:18 IST|Sakshi

 20 శాతం పెరిగిన ఆదాయం ∙ రూ.773  కోట్లకు ఇబిటా   

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.63 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.59 కోట్లకు తగ్గిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఇబిటా రూ.580 కోట్ల నుంచి రూ.773 కోట్లకు పెరిగినట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.7,594 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.9,083 కోట్లకు పెరిగిందని వివరించారు.

కంపెనీ స్థానం మరింత సుస్థిరం...
ఇంధన, మౌలికరంగ కంపెనీగా తమ కంపెనీ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తున్నామని, ప్రభుత్వ సానుకూల విధానాలు కలసివస్తున్నాయని గౌతమ్‌ అదానీ చెప్పారు.

ఐఓసీతో సిటీ గ్యాస్‌ జేవీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌... వివిధ నగరాల్లో పైప్‌ల ద్వారా గ్యాస్‌ సరఫరా చేసే ప్రాజెక్ట్‌లను సాధించిందని తెలిపింది. అలహాబాద్, డామన్‌ నగరాల్లో ఇప్పటికే కార్యకలాపాలు  ప్రారంభించామని, చంఢీగర్, ఎర్నాకుళం, పానిపట్, ఉధమ్‌ సింగ్‌ నగర్, ధార్వాడ్‌ నగరాల్లో  ఈ ప్రాజెక్ట్‌ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రెజెస్‌ షేరు 2% నష్టంతో రూ.153 వద్ద ముగిసింది. ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయి రూ.58గా, గరిష్ట స్థాయి రూ.160గా ఉన్నాయి.


అదానీ పోర్ట్స్‌లాభం 8% డౌన్‌
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌)  నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 8% క్షీణించి రూ.992 కోట్లకు చేరింది.

గత క్యూ2లో రూ.82 కోట్లుగా ఉన్న పన్నుల భారం ఈ క్యూ2లో రూ.381 కోట్లకు పెరగడంతో నికర లాభం తగ్గిందని ఈ లాజిస్టిక్స్‌ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,077 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌  కరణ్‌ అదానీ చెప్పారు.. మొత్తం ఆదాయం రూ.2,410 కోట్ల నుంచి 23% వృద్ధితో రూ.2,962 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.1,252 కోట్ల నుంచి రూ.1,584 కోట్లకు పెరిగాయని వివరించారు.

రూ.17,864 కోట్ల నికర రుణభారం
ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌ రూ.690 కోట్లుగా ఉన్నాయని, నికర రుణభారం రూ.737 కోట్లు తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి తమ నికర రుణ భారం రూ.17,864 కోట్లుగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ 3 శాతం తగ్గి రూ.414 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు