ఎయిరిండియాపై అదానీ కన్ను!

26 Feb, 2020 07:54 IST|Sakshi

బిడ్డింగ్‌ పత్రాల పరిశీలన తర్వాత తుది నిర్ణయం

ఇప్పటికే రేసులో టాటా గ్రూప్, ఇండిగో, హిందూజా కుటుంబం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలు రేసులో తాజాగా అదానీ గ్రూప్‌ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. బిడ్డింగ్‌ పత్రాలను అధ్యయనం చేసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని సంస్థ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిరిండియాపై అదానీ గ్రూప్‌ ఆసక్తి ప్రాథమిక స్థాయిలోనే ఉందని, దాని అప్పులు.. నష్టాలపై పూర్తి స్థాయి మదింపు ఆధారంగా బిడ్‌ వేసేదీ లేనిదీ ఉంటుందని వివరించాయి. ఒకవేళ బిడ్‌ చేసిన పక్షంలో టాటా గ్రూప్, హిందుజా కుటుంబం, విమానయాన సంస్థ ఇండిగో, అమెరికాకు చెందిన ఇంటరప్స్‌ ఫండ్‌తో అదానీ గ్రూప్‌ పోటీపడాల్సి ఉంటుంది. తమ విమానాశ్రయాల నిర్వహణ కార్యకలాపాలకు కొనసాగింపుగా ఎయిరిండియా విమానయాన సంస్థ ఉండగలదని అదానీ గ్రూప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిడ్డింగ్‌ నిబంధనల ప్రకారం అదానీకి ఎటువంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ(ఏఏఐ) నిబంధనలు అడ్డంకిగా మారొ చ్చని అంచనాలు ఉన్నాయి. ఏఏఐ నిబంధనల ప్రకారం .. విమానయాన సంస్థ లేదా ఎయిర్‌లైన్‌ ఉన్న గ్రూప్‌లకు.. విమానాశ్రయాల్లో 27 శాతానికి మించి వాటాలు ఉండకూడదు. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్‌నకు ఇది ప్రతిబంధకంగా ఉండవచ్చని అంచనా.

బిడ్డింగ్‌ గడువు పొడిగింపు?
ఎయిరిండియా బిడ్డింగ్‌కు నిర్దేశించిన మార్చి 17 గడువును కేంద్రం మరింత పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొత్త డెడ్‌లైన్‌పై ఈ వారంలో జరిగే అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆసక్తి గల బిడ్డర్లు రూ. 1 కోటి నాన్‌–రిఫండబుల్‌ ఫీజు కడితే వర్చువల్‌ డేటా రూమ్‌ నుంచి ఎయిరిండియా వివరాలు, షేర్ల కొనుగోలు ఒప్పందం ముసాయిదా (ఎస్‌పీఏ) చూడవచ్చని పేర్కొన్నాయి. సందేహాలేమైనా ఉన్న పక్షంలో లావాదేవీ సలహాదారు, కేంద్ర పౌర విమానయాన శాఖ నివృత్తి చేస్తాయని వివరించాయి. సందేహాల నివృత్తి కోసం నిర్దేశించిన ఫిబ్రవరి 11 గడువును కేంద్రం ఇప్పటికే మార్చి 6 దాకా పొడిగించింది. సుమారు రూ. 60,074 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాలో పూర్తి వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం మరో దఫా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొంత రుణాన్ని స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌కు బదలాయించనుంది. బిడ్డింగ్‌లో గెలుపొందే సంస్థ సుమారు రూ. 23,286 కోట్ల రుణాల బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు