అదానీకి మెగా ‘సౌర’భం

10 Jun, 2020 04:31 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కాంట్రాక్టు కైవసం

రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు

8 గిగావాట్స్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం

25 ఏళ్ల పాటు విద్యుత్‌ సరఫరా 

న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ఇందులో భాగంగా 8 గిగావాట్స్‌  ఫొటోవోల్టెయిక్‌ (పీవీ) విద్యుత్‌ ప్లాంటుతో పాటు దేశీయంగా సోలార్‌ ప్యానెళ్ల తయారీ యూనిట్‌ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ప్రభుత్వ రంగ ఎస్‌ఈసీఐ (గతంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) నుంచి దక్కించుకున్న ఈ కాంట్రాక్టు కింద 2 గి.వా. (2,000 మె.వా) సామర్థ్యంతో దేశీయంగా సోలార్‌ పయానెల్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలి. అలాగే 8 గి.వా. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మించాలి. ‘ఎస్‌ఈసీఐతో తయారీ ఆధారిత సౌర విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది‘ అని అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఈఎల్‌) తెలిపింది. ఈ ప్రాజెక్టుతో కలిపి అదానీ గ్రీన్‌ వద్ద ప్రస్తుతం 15 గి.వా. పునరుత్పాదక విద్యుదుత్పత్తి అసెట్స్‌ ఉన్నట్లవుతుంది.

రూ. 2.92 టారిఫ్‌..: కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు యూనిట్‌కు స్థిరంగా రూ. 2.92 చొప్పున  కంపెనీకి టారిఫ్‌ లభిస్తుంది. ఇంత భారీ సామర్థ్యం గల ప్రాజెక్టు కాంట్రాక్టు ఇదేనని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్‌ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యానికి మరింత చేరువయ్యేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే మరో 10 గి.వా. సామర్థ్యంగల ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా 25 గి.వా. సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోగలం‘ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్తాన్, గుజరాత్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్తాన్‌లోని జైసల్మేర్, బికనీర్, జోధ్‌పూర్‌లో అటు గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో నెలకొల్పవచ్చని వివరించాయి. సుమారు 4,00,000 దాకా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నాయి.

2025 నాటికి పూర్తి.. 
ముందుగా 2022 నాటికి తొలి 2 గి.వా. ఉత్పత్తి సామర్థ్యం ప్రాజెక్టు మొదలవుతుందని, మిగతాది 2 గి.వా. చొప్పున 2025 నాటికి పూర్తవుతుందని అదానీ తెలిపారు. ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు, 2022 నాటికి సోలార్‌ తయారీ కేంద్రం సిద్ధం కానున్నట్లు చెప్పారు. ఏకంగా 25 ఏళ్ల పాటు స్థిరంగా రూ. 2.92 మాత్రమే టారిఫ్‌ ఉండనుండటంపై స్పందిస్తూ ‘మాకు తగినంత మార్జిన్‌ ఉంటుంది. అంతేగాక ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3–5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. తగినంత మార్జిన్‌ ఉండటం వల్ల టారిఫ్‌ విషయంలో సమస్యేమీ లేదు‘ అని అదానీ తెలిపారు.

ఇక, ఆగ్నేయాసియా దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి చౌకగా దిగుమతుల వల్ల దేశీ సంస్థలు నష్టపోకుండా తగు రక్షణాత్మక సుంకాలు అమలవుతుండటం కూడా ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు. 900 మిలియన్‌ టన్నుల మేర కర్బన ఉద్గారాలను ఈ భారీ ప్రాజెక్టు తగ్గిస్తుందని, తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో తమ సంస్థ రూ. 1,12,000 కోట్ల మేర (దాదాపు 15 బిలియన్‌ డాలర్లు) ఇన్వెస్ట్‌ చేసేందుకు ఈ కాంట్రాక్టు ఊతమివ్వగలదని అదానీ చెప్పారు.

మరిన్ని వార్తలు