అదానీ పోర్ట్స్‌ చేతికి కట్టుపల్లి పోర్ట్‌

29 Jun, 2018 00:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూపులో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) చెన్నైకు సమీపంలోని కట్టుపల్లి పోర్ట్‌ను సొంతం చేసుకోనుంది. కట్టుపల్లి పోర్ట్‌ ఆపరేటర్‌గా ఉన్న మెరైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను (ఎంఐడీపీఎల్‌) రూ.1,950 కోట్లతో కొనుగోలు చేయనుంది.

రూ.1,562 కోట్లను ఎంఐడీపీఎల్‌ బకాయిలను తీర్చేందుకు, మిగిలిన రూ.388 కోట్లను షేర్ల కొనుగోలుకు వెచ్చించనున్నట్టు అదానీ తెలిపింది. ఎంఐడీపీఎల్‌లో 97 శాతం షేర్ల కొనుగోలుకు ఎల్‌అండ్‌టీ, మెరైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్‌ ప్రైవేటు లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్, అదానీ కట్టుపల్లి పోర్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మధ్య ఒప్పందం కుదరినట్టు అదానీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలోని అధునిక పోర్టుల్లో కట్టుపల్లి కూడా ఒకటని, చెన్నై/బెంగళూరు ప్రాంత ఎగుమతులు, దిగుమతుల వ్యాపారానికి నూతన ముఖద్వారంగా అవతరిస్తోందని తెలిపింది. కార్గో పోర్ట్‌ను విస్తరిస్తామని, వచ్చే మూడేళ్లలో 40 మిలియన్‌ టన్నుల సామర్థ్యం పెంచుతామని పేర్కొంది. తమ నిర్వహణ సామర్థ్యాలతో పోర్ట్‌ సమీప ప్రాంత పరిశ్రమలకు రవాణా వ్యయాలను తగ్గించగలమని ఆశాభావం వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు