జీఎంఆర్‌ ప్లాంటుపై అదానీ కన్ను

28 Aug, 2018 00:53 IST|Sakshi

తుది దశలో ఛత్తీస్‌గఢ్‌ ఎనర్జీ టేకోవర్‌ డీల్‌?

త్వరలో అధికారిక ప్రకటన

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన విద్యుత్‌ ప్లాంటు టేకోవర్‌ ప్రయత్నాలను అదానీ పవర్‌ ముమ్మరం చేసింది. జీఎంఆర్‌ చత్తీస్‌గఢ్‌ ఎనర్జీ (జీఎంఆర్‌సీఈ) కొనుగోలుకు సంబంధించిన డీల్‌ దాదాపు తుదిదశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్‌ కింద జీఎంఆర్‌సీఈకి చెందిన రూ. 5,800 కోట్ల రుణభారంలో దాదాపు రూ. 3,800 కోట్లు,  అలాగే రూ. 1,400 కోట్ల నిధులయేతర భారం అదానీ పవర్‌కు బదలాయింపు అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రుణదాతలు లాంఛనంగా ఆమోదముద్ర వేసిన తర్వాత మరికొన్ని వారాల్లో డీల్‌ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ కింద రెండు 685 మెగావాట్‌ బొగ్గు ఆధారిత పవర్‌ యూనిట్లు ఉన్నాయి. గతేడాది వీటిలో వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద జీఎంఆర్‌ చత్తీస్‌గఢ్‌ నియంత్రణాధికారాలను బ్యాంకులు గతేడాది జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే.

యాక్సిస్‌ బ్యాంక్‌ సారథ్యంలోని  బ్యాంకుల కన్సార్షియం రూ. 3,000 కోట్ల రుణాలను సంస్థలో 52% వాటాల కింద మార్చుకున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు అదానీ పవర్‌తో పాటు వేదాంత, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ప్రభుత్వ రంగ ఎన్‌ఎల్‌సీ ఇండియా తదితర సం స్థలు నాన్‌–బైండింగ్‌ బిడ్లు దాఖలు చేసినట్లు కంపెనీకి రుణాలిచ్చిన పీఎఫ్‌సీ గతంలో వెల్లడించింది.


కృష్ణగిరిలో జీఎంఆర్‌ ఎస్‌ఐఆర్‌కు శంకుస్థాపన..
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తలపెట్టిన జీఎంఆర్‌ కృష్ణగిరి స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (జీకేఎస్‌ఐఆర్‌)కు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ టిడ్కోతో కలిసి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దీన్ని ఏర్పాటు చేస్తోంది. కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌లో సుమారు 2,100 ఎకరాల్లో ఈ రీజియన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ఆటోమొబైల్, ఆటో పరికరాలు, డిఫెన్స్‌ .. ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి హైటెక్‌ పరిశ్రమలపై జీకేఎస్‌ఐఆర్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఇందులో దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. ‘రాష్ట్రంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు, ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చే సంస్థలకు జీఎంఆర్‌ దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థలాన్ని లీజుకి ఇస్తుంది. ఆయా సంస్థలు కావాలనుకుంటే పూర్తిగా కొనుక్కోవచ్చు’ అని జీఎంఆర్‌ గ్రూప్‌ బిజినెస్‌ చైర్మన్‌ (అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్‌ విభాగం) బీవీఎన్‌ రావు తెలిపారు.

>
మరిన్ని వార్తలు