అదానీ లాభంలో 17 శాతం క్షీణత  

11 May, 2018 00:52 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నికరలాభం 17 శాతం క్షీణించి రూ. 181 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 218.80 కోట్ల లాభం నమోదు చేసింది. ఆదాయాల్లో క్షీణత లాభంపై చూపిందని కంపెనీ పేర్కొంది. గతేడాది క్యు4లో కంపెనీ ఆదాయం 11997.91 కోట్ల రూపాయలుండగా,  తాజా ఫలితాల్లో కంపెనీ ఆదాయం 10577 కోట్ల రూపాయలకు క్షీణించింది. ఇదే సమయంలో వ్యయాలు సైతం 11566 కోట్ల రూపాయల నుంచి 10095 కోట్ల రూపాయలకు దిగివచ్చాయి.

సమీక్షా కాలంలో కంపెనీ కోల్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌లో దాదాపు 25 శాతం క్షీణత నమోదయింది. సమీక్షా కాలంలో తమ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని కంపెనీ తెలిపింది. దేశీయ ఎకానమీలో వృద్ధి, ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెరగడం, సానుకూల రెగ్యులేటరీ వాతావరణం.. భవిష్యత్‌పై ఆశలను పెంచుతున్నాయని గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లకు గౌతం అదానీని మరోమారు కంపెనీ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎన్నుకుంది. రాబోయే ఏజీఎంలో రూ. 5వేల కోట్ల సమీకరణపై చర్చించి వాటాదారుల అనుమతి పొందాలని బోర్డు నిర్ణయించింది. 

>
మరిన్ని వార్తలు