విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ నిధులు

21 Sep, 2016 00:39 IST|Sakshi
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ నిధులు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ‘ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్’ (ఏడీబీ) తాజాగా భారత్ తొలి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రుణ సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం-చెన్నై మధ్యలో నిర్మాణం కానుంది. దీనికోసం ఏడీబీ 631 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,200 కోట్లు) మేర నిధులను అందించడానికి ముందుకొచ్చింది.

ఈ నిధులతో తొలిగా మొత్తం 2,500 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటులో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని, దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. కాగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 846 మిలియన్ డాలర్లు. మిగతా 215 మి. డాలర్లను ఆంధ్రప్రదేశ్ సర్కారు సమకూర్చాల్సి ఉంటుంది.

>
మరిన్ని వార్తలు