ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

22 Jul, 2019 12:32 IST|Sakshi

భారత్‌లో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన ఏడీబీ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా 0.2 శాతం తక్కువగా 4.1 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉండగలదని వివరించింది. రూపాయి బలపడటం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)అంచనాలు తగ్గడం తదితర అంశాలు ద్రవ్యోల్బణ తగ్గుదలకు కారణాలు కాగలవని ఏడీబీ తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదవడంలో భారత్‌ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీవో) 2019 అనుబంధ నివేదికలో ఏడీబీ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 0.2 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 7 శాతానికి పరిమితం కాగలదని ఇందులో పేర్కొంది. 2019లో దక్షిణాసియా ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసిన 4.7 శాతం కన్నా తక్కువగా 4.5 శాతం మేర నమోదు కాగలదని తెలిపింది.

వివిధ అంశాల కారణంగా సరఫరా, డిమాండ్‌పై ప్రభావం చూపుతూ బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేట్ల హెచ్చుతగ్గులకు లోను కావడం కొనసాగుతుందని వివరించింది. వీటితో పాటు ఇతరత్రా దేశీయ అంశాల కారణంగా 2019, 2020లో వర్ధమాన ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసినట్లు 2.5 శాతం కాకుండా 2.6 శాతంగా నమోదు కావొచ్చని ఏడీబీ తెలిపింది.

మరిన్ని వార్తలు