ఐడీబీఐ బ్యాంక్ వాటా రేసులో విదేశీ దిగ్గజాలు!

2 Jul, 2016 01:06 IST|Sakshi
ఐడీబీఐ బ్యాంక్ వాటా రేసులో విదేశీ దిగ్గజాలు!

ఏడీబీ, ఐఎఫ్‌సీ ఆసక్తి
26% వాటా సేల్‌కు త్వరలో క్విప్ ఇష్యూ
రూ.3,771 కోట్లు సమీకరించే చాన్స్

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. బ్యాంకులో 26 శాతం మేర వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.3,771 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం పలు విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) రూపంలో వాటా విక్రయించనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) వంటి దిగ్గజాలు క్విప్ ఇష్యూ ద్వారా వాటా కొనుగోలుపై సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) ద్వితీయార్థంలో ఇష్యూ ఉండొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు.

 డిసెంబర్‌లోనే ఆమోదం...
ఐడీబీఐ బ్యాంక్‌లో క్విప్ రూట్ ద్వారా రూ.3,771 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం కేంద్రానికి బ్యాంక్‌లో 73.96 శాతం వాటా ఉంది. అయితే, క్విప్ పూర్తయితే ఇందులో 26 శాతం మేర వాటా తగ్గిపోయే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు