స్వల్పకాల పెట్టుబడుల కోసం..

13 Aug, 2018 01:39 IST|Sakshi

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌

సెబీ ఆదేశాల మేరకు షార్ట్‌ డ్యురేషన్‌ కేటగిరీ ఫండ్స్‌ ఏడాది నుంచి మూడేళ్లు కాల వ్యవధి కలిగిన డెట్‌ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పెద్దగా రిస్క్‌ తీసుకోని వారు, స్వల్ప స్థాయి నుంచి మోస్తరు రిస్క్‌ను తట్టుకునేవారు, ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కోసం పెట్టుబడుల కోసం షార్ట్‌ డ్యురేషన్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ నిలకడైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఇది పూర్తిగా నూరు శాతం పెట్టుబడులను డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీల్లో పెట్టదు.

రాబడులు...
ఈ పథకం ఏడాదిలో 4.3%, మూడేళ్లలో 7.7 శాతం, ఐదేళ్లలో వార్షికంగా సగటున 8.7 శాతం రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో ఈ కేటగిరీ రాబడులు ఏడాదిలో 4.7 శాతం, మూడేళ్లలో 7.1 శాతం, ఐదేళ్లలో 7.9 శాతం చొప్పున ఉన్నాయి. అంటే కేటగిరీని మించిన రాబడులు ఉన్నాయి.

తక్కువ కాల వ్యవధి కలిగిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ను తగ్గించే విధంగానే ఉంటాయి. ఈ పథకం 30–40 శాతం పెట్టుబడులను ఏఏ రేటెడ్‌ బాండ్లలో పెడుతుంది. ఇటీవలి కాలంలో కార్పొరేట్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో ఈ పథకంలో పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందొచ్చు. సగటు కాల వ్యవధిని 1–3 ఏళ్ల మధ్యే నిర్వహిస్తూ వచ్చింది. సెబీ నూతన నిబంధనలు కూడా ఈ మేరకే ఉండడంతో గత పనితీరును ప్రామాణికంగా తీసుకోవచ్చు.  

స్థిరమైన పనితీరు
ఈ పథకం ఈ విభాగంతో పోలిస్తే సగటున అన్ని కాలాల్లోనూ అధిక రాబడులనే అందించింది. 2014, 2016లో 11.3 శాతం మేర రాబడులను అందించిన చరిత్ర ఉంది. ఇక బలహీన సమయాల్లో 2015లో 8.4 శాతం రాబడులను ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 4.3 శాతంగానే ఉన్నాయి. ఇదే విభాగంలోని ఇతర టాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఇది తక్కువ పనితీరే. తక్కువ రిస్క్, తక్కువ రాబడులు ఉండే ఏఏఏ రేటెడ్‌ డెట్‌ సాధనాల్లో అధిక పెట్టుబడులు కలిగి ఉండడమే ఇందుకు కారణం. వార్షికంగా కాంపౌండెడ్‌ సగటు రాబడులు గత ఐదేళ్ల కాలంలో 8.7 శాతంగా ఉండడం గమనార్హం.  

పోర్ట్‌ఫోలియో...: జూన్‌ నాటికి 46% పెట్టుబడులను ఏఏఏ రేటెడ్‌ బాండ్లలో 30% పెట్టుబడులను ఏఏ రేటెడ్‌ వాటిలో, 10.6% పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది.  

మరిన్ని వార్తలు