పెరిగిన ఎస్‌బీఐ అడ్వాన్స్ టాక్స్

16 Dec, 2014 04:09 IST|Sakshi
పెరిగిన ఎస్‌బీఐ అడ్వాన్స్ టాక్స్

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి దేశీ కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. క్యూ3 ముందస్తు పన్ను చెల్లింపుల గడువు సోమవారం(16న) ముగిసింది. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 1,425 కోట్లను చెల్లించింది.

గతేడాది(2013-14) ఇదే క్వార్టర్‌లో రూ. 1,130 కోట్లను మాత్రమే చెల్లించింది. ఈ బాటలో గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ 13% అధికంగా రూ. 735 కోట్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో రూ. 650 కోట్లను చెల్లించింది. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజాగా రూ. 135 కోట్ల పన్ను కట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
 
ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు
ఈ ఏడాదికి పెట్టుకున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 7.36 లక్షల కోట్లుకాగా, వీటిలో దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు లభించగలవని ఆదాయ పన్ను శాఖ భావిస్తోంది. కాగా, ఈ ఏడాది తొలి అర్థభాగంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 7% మాత్రమే పెరిగి రూ. 2.68 లక్షల కోట్లకు చేరాయి. లక్ష్యంగా పెట్టుకున్న 17% వృద్ధితో పోలిస్తే ఈ గణాంకాలు నిరుత్సాహం కలిగించేవే.

ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో లాభాలు ఆర్జించే కార్పొరేట్లు, వ్యక్తులు దఫదఫాలుగా చెల్లించే పన్నునే ముందస్తు పన్ను చెల్లింపులుగా పేర్కొంటారు. సాధారణంగా రెండో క్వార్టర్‌లో కంపెనీలు 30% పన్నును ముందస్తుగా చెల్లిస్తాయి.  కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వాటి పనితీరును తెలియజేస్తాయని ఒక అంచనా.

మరిన్ని వార్తలు