భారతీయులు అమితంగా ప్రేమించేది వాటినే..

4 Jul, 2018 11:52 IST|Sakshi

న్యూఢిల్లీ : బంగారమంటే భారతీయులకు ఎనలేని ప్రేమ. కొంత డబ్బు కూడబెట్టగానే బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు. తాజాగా బంగారాన్ని మించి ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను అమితంగా ప్రేమిస్తున్నారట. తాజాగా వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ కొనుగోళ్లు అలుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయని తెలిసింది. ఆయిల్‌ తర్వాత భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువులుగా ఎలక్ట్రానిక్సే ఉన్నాయని తాజా గణాంకాల్లో వెల్లడైంది. దీంతో దేశీయ వాణిజ్య లోటు కూడా పెరిగిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది రూపాయికి బ్యాడ్‌ న్యూస్‌ అని ఆర్థిక వేత్తలు అంటున్నారు. 

ఇప్పటికే ఆయిల్‌ దిగుమతులతో ఖరీదైనదిగా మారిన రూపాయి, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులతో మరింత ఆందోళనకరంగా మారిందని తెలిపారు. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కరెంట్‌ అకౌంట్‌ లోటు 2.3 శాతానికి పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్‌ పోల్‌లో తెలిసింది. ప్రస్తుతం ఇది 1.9 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు దిగుమతలు పెరుగుతుండటం ఇప్పటికే కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ సౌగత భట్టాచార్య చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌తో స్థానిక తయారీ పెరిగి, దిగుమతులు తగ్గుతుండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్లు, పీసీలు, ఇతర కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలు చేసేందుకు చైనా అతిపెద్ద వనరుగా ఆర్థిక వేత్తలన్నారు. మొత్తంలో 60 శాతం అక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. 

కేవలం ఆయిల్‌ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్‌ కూడా దేశీయ కరెంట్‌ అకౌంట్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయని కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కొటక్‌ ట్వీట్‌ చేశారు. 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులు రెండింతలు పైగా పెరిగాయని చెప్పారు. కాగ, గత 13 నెలల కాలంలో బంగారం దిగుమతులు 35.8 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, బంగారం కంటే అధికంగా ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులు 57.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఇక బంగారం కంటే ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌నే భారతీయులు అమితంగా ప్రేమిస్తున్నారని వెల్లడవుతోంది. 
 

మరిన్ని వార్తలు