వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు

2 Jun, 2018 00:48 IST|Sakshi

జాబితాలో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌

న్యూఢిల్లీ: గృహ, వాహన రుణాలను భారం చేస్తూ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన బ్యాంకులు.. రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) 0.1 శాతం దాకా పెంచాయి. రేట్లు పెంచిన వాటిల్లో ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎస్‌బీఐ, పీఎన్‌బీతో పాటు ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి.

కొత్త రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. మూడేళ్ల దాకా కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ను ఎస్‌బీఐ 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ శ్రేణి 7.9 శాతం–8.45 శాతానికి చేరింది. మరోవైపు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 8.55 శాతానికి, అయిదేళ్ల దాన్ని 8.7 శాతానికి పెంచింది.

బేస్‌ రేటును కూడా 9.15 శాతం నుంచి 9.25 శాతానికి మార్చింది. ఇక, ప్రైవేట్‌ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా అయిదేళ్ల కాలావధి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.70 శాతానికి సవరించింది. ఏడాది, మూడేళ్ల వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను కూడా 0.1 శాతం పెంచింది. అయితే, మూడు నెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు మాత్రం యధాతథంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు