బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు!

19 Apr, 2017 06:38 IST|Sakshi
బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు!

ఎస్‌బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు
చిన్న బ్యాంకులను సొంతం చేసుకోనున్న పీఎన్‌బీ, బీవోబీ
ఈ దిశగా కేంద్ర సర్కారు కసరత్తు  


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రక్షాళణలో భాగంగా తదుపరి విలీనాలపై కసరత్తు జరుగుతోంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే దిశగా నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అనంతరం మరోసారి ఈ రంగంలో స్థిరీకరణపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లు చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ప్రభుత్వం విలీనం చేయాల్సిన బ్యాంకులపై దృష్టి పెట్టిందని... పలు చిన్న బ్యాంకులకంటే కొన్ని పెద్ద బ్యాంకులు ఉండాలన్నది ప్రధానమంత్రి కార్యాలయం యోచన అని ఆ వర్గాలు వెల్లడించాయి.

పరిశీలనలో ఇవే...
ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనల ప్రకారం పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు పీఎన్‌బీలో విలీనమయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా బీవోబీ దక్షిణాదిన ప్రముఖ బ్యాంకు అయిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకును తనలో కలిపేసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు ప్రతిపాదనలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. అయితే, ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, వీటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి ఆర్‌బీఐతో కలసి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తాజా విలీనాల అంశం తెర ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఆర్‌బీఐ గత వారం తీసుకొచ్చిన కఠిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నియంత్రణ పరమైన నిబంధనావళిని బ్యాంకులు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థిరీకరణకు దిశగా అడుగులు వేయక తప్పదు. కాగా, విలీనం విషయంలో చట్టపరంగా నడుచుకుంటామని, విలీనానికి ముందు బ్యాంకులకు అవకాశం ఇవ్వనున్నట్టు, అవసరమైతే కాంపిటీషన్‌ కమిషన్‌ అనుమతులు తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రక్షాళనతోపాటు వాటిబలోపేతానికి గాను ఇంద్ర ధనుష్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2015లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు