వన్‌ప్లస్‌ టీవీలూ వస్తున్నాయ్‌..

22 Aug, 2019 05:49 IST|Sakshi

సెప్టెంబర్‌లో మార్కెట్లోకి

తొలిసారిగా భారత్‌లోనే ఆవిష్కరణ

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా స్మార్ట్‌ టీవీలను అందుబాటులోకి తెస్తోంది. సెప్టెంబర్‌లో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. చైనా కన్నా ముందుగా భారత మార్కెట్లోనే స్మార్ట్‌ టీవీలను ప్రవేశపెడుతుండటం గమనార్హం. ‘వన్‌ప్లస్‌ టీవీలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించబోతున్నాం. వీటిని ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెస్తున్నాం’ అని వన్‌ప్లస్‌ ఫోరంలో సంస్థ సీఈవో పీట్‌ లౌ వెల్లడించారు. అయితే, టీవీ ధర, ఇతరత్రా ఫీచర్స్‌ మొదలైన వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థ షావోమీ కూడా గతేడాది నుంచే భారత్‌లో టీవీలను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. ఇక శాంసంగ్, ఎల్‌జీ, మైక్రోమ్యాక్స్‌ వంటి ఇతరత్రా ఫోన్స్‌ తయారీ సంస్థలకు కూడా సొంతంగా టీవీ బ్రాండ్స్‌ ఉన్నాయి.

ప్రస్తుతం వాటి బాటలోనే వన్‌ప్లస్‌ సంస్థ సైతం స్మార్ట్‌టీవీల విభాగంలోకి అడుగుపెడుతోంది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నామని, క్రమంగా ఒక్కో మార్కెట్‌లో ఈ టీవీలను ప్రవేశపెడతామని పీట్‌ వివరించారు. భారత్‌లో వివిధ కంటెంట్‌ ప్రొవైడర్స్‌తో  సత్సంబంధాలు ఉండటంతో యూజర్లకు మరింత మెరుగైన కంటెంట్‌ను అందించగలమన్నారు. ఉత్తర అమెరికా, యూరప్, చైనా తదితర మార్కెట్లలో కూడా వన్‌ప్లస్‌ టీవీని ఆవిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ కంటెంట్‌ ప్రొవైడర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నా మని పీట్‌ చెప్పారు. ‘ప్రతీ చిన్న విషయంపైనా దృష్టి పెడతాం. భవిష్యత్‌ స్మార్ట్‌ టీవీలకు ప్రమాణాలు నిర్దేశించేలా మా ఉత్పత్తి ఉండాలన్నది మా లక్ష్యం’ అని ఆయన చెప్పారు. 2019 జూన్‌ క్వార్టర్‌ లో భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో (రూ.30,000 పైగా ధర ఉండే ఫోన్స్‌) వన్‌ప్లస్‌ 43 శాతం వాటాతో అగ్రస్థానంలో నిల్చింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా