ఏజీఆర్‌ : మొత్తం బకాయిలు చెల్లించమని ఆదేశించాం

11 Mar, 2020 16:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఏజీఆర్‌ బకాయిల  చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం  టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించిన ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్ల నుండి సుమారు రూ .25,900 కోట్లను ప్రభుత్వం అందుకుందనీ, త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయమని టెల్కోలను మళ్లీ ఆదేశించామని పార్లమెంటుకు అందించిన సమాచారంలో కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే  వెల్లడించారు. అక్టోబర్ 24, 2019 నాటి బుధవారం  లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అక్టోబర్ 24, 2019 నాటి  సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్  కొన్ని చెల్లింపులు చేశాయని తెలిపారు. మార్చి 4, 2020  రాసిన లేఖలో పూర్తి చెల్లింపులు చేయాలని ఆపరేటర్లను ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం లేదా కార్టలైజేషన్‌ను నివారించడానికి కొత్త  యాంట్రీ ట్రస్ట్‌  లాను  ఏర్పాటు చేసే  ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని మరో ప్రశ్నకుసమాధానంగా వెల్లడించారు. 

భారతి ఎయిర్‌టెల్ ఇప్పటివరకు రూ .18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .3500 కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి  తెలిపారు. టాటా టెలిసర్వీసెస్ సుమారు రూ.4,197 కోట్లు చెల్లించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3.9 కోట్లు , రిలయన్స్ జియో సుమారు రూ .195 కోట్లు చెల్లించిందన్నారు. టెలికాం రంగంలో ఆర్థిక ఇబ్బందులపై జోక్యం చేసుకోవాలన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ)  అభ్యర్థన మేరకు టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించామన్నారు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుందన్నారు. ఏజీఆర్‌ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు