మైలాన్ చేతికి ఫామీ కేర్

3 Feb, 2015 03:13 IST|Sakshi
మైలాన్ చేతికి ఫామీ కేర్

ఒప్పందం విలువ సుమారు రూ. 5,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  మహిళల ఆరోగ్య ఉత్పత్తులను అందించే ఫామీకేర్ వ్యాపారాన్ని మైలాన్ లేబొరేటరీస్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 5,000 కోట్లని మైలాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జనరిక్ ఓరల్ కాంట్రాసెప్టివ్ ప్రోడక్ట్స్(ఓసీపీ)లో అంతర్జాతీయ లీడర్‌గా ఉన్న ఫామీ కేర్‌ను 750 మిలియన్ డాలర్లతో భవిష్యత్తు చెల్లింపులు ఏమైనా ఉంటే గరిష్టంగా 50 మిలియన్ డాలర్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు మైలాన్ తెలిపింది.

ముంబై కేంద్రంగా 1999లో ప్రారంభమైన ఫామీ కేర్ మహిళల గర్భనిరోధక మాత్రలు, మహిళలు వినియోగించే గర్భనిరోధక సాధనాల తయారీ సరఫరాలో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. ఈ ఒప్పందంతో అమెరికా, యూరోప్ మహిళా హెల్త్‌కేర్ విభాగంలోకి చొచ్చుకుపోగలమన్న ధీమాను మైలాన్ సీఈవో హెదర్ బ్రెష్ సంతోషం వ్యక్తం చేశారు. యూరోప్ ఫామీకేర్‌తో 2008 నుంచి కలిసి పనిచేస్తున్నామని, ఫామీకేర్‌కు చెందిన 900 మంది ఉద్యోగులను మైలాన్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో 15 శాతం మంది ఫ్యామీ కేర్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు మైలాన్ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో డీల్ పూర్తి కాగలదని హెదర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మా ట్రిక్స్ లాబొరేటరీస్‌ను 2007లో మైలాన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు