కార్పొరేట్లకు బడ్జెట్ లో నిరాశే!

6 Feb, 2016 01:33 IST|Sakshi
కార్పొరేట్లకు బడ్జెట్ లో నిరాశే!

ప్రోత్సాహకాలను తగ్గించే అవకాశం..
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు నెరవేరకపోవడమే కారణం
ద్రవ్యలోటు పెరగవచ్చన్న ఆందోళనలు కూడా...
కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గిస్తామని
గత బడ్జెట్లోనే కేంద్రం హామీ...


న్యూఢిల్లీ: మోదీ సర్కారు రానున్న బడ్జెట్లో కార్పొరేట్ రంగాన్ని నిరాశపరచనుందా? ప్రోత్సాహకాల కోతకు తెరతీయనుందా? ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితులను చూస్తే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించి పోతుందన్న ఆందోళనలకు తోడు డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోవడం వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో ఈ సారి బడ్జెట్లో పన్ను వసూళ్లు, ప్రభుత్వ రంగ వాటా విక్రయాలకు సంబంధించి లక్ష్యాల విధింపులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించనున్న సంగతి తెలిసిందే.

 డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి కోత...!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యం జీడీపీలో 3.9 శాతం(రూ.5.55 లక్షల కోట్లు) కాగా, దీన్ని మించిపోవచ్చనే సంకేతాలు స్పష్టం కనబడుతున్నాయి. డిసెంబర్ నాటికే ద్రవ్యలోటు లక్ష్యంలో 88 శాతానికి(రూ. 4.88 లక్షల కోట్లు) చేరుకుంది. వాస్తవానికి ఈ ఏడాదే ద్రవ్యలోటును 3.6 శాతానికి కట్టడి చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం దీన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోపక్క, ఈ ఏడాది భారీస్థాయిలో రూ.68,500 కోట్ల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా... కేవలం రూ.12,700 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. దీంతో వచ్చే ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.35 వేల కోట్లకు పరిమితం చేయొచ్చన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలకు ఎలా కళ్లెం వేస్తారు, ఆదాయాలను ఎలా పెంచుకుంటారనేదానిపై రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక వేత్తలు దృష్టిపెట్టారు.

ఇప్పటికే సంకేతాలు...
తాజాగా మోదీ ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న రాయితీలు, పోత్సాహకాలను తగ్గించాల్సి ఉందని... హేతుబద్దీకరించనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కార్పొరేట్లకు రూ.62,400 కోట్ల మేర భారీ పన్ను ప్రయోజనాలు, ఇతరత్రా రాయితీలు అమలవుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నామని గత బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు. మూలధన పెట్టుబడులు, పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ప్రాజెక్టుల ఏర్పాటు చేసే సంస్థలకు ఇస్తున్న పన్ను ప్రయోజనాలకు జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో కోత విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి భారత్‌ను తయారీ హబ్‌గా మార్చడం కోసం మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా కంపెనీలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పన్ను ప్రయోజనాల్లో లొసుగులను పూడ్చే క్రమంలో వాటికి కోత వేసే చర్యలను ప్రభుత్వం గనుక చేపడితే.. అది మేక్ ఇన్ ఇండియాకు అవరోధంగా మారొచ్చని కేపీఎంజీకి చెందిన ట్యాక్స్ పార్ట్‌నర్ రాహుల్ మిత్రా అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ఒక్కో భారతీయ కంపెనీపై అన్ని రకాల పన్నులు కలిపి దాదాపు 34%గా అంచనా. అంతర్జాతీయంగా చూస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ వాస్తవ రేటు 23 శాతంగా లెక్కగడుతున్నారు.

అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ రాయితీలే..
కార్పొరేట్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల రూపంలోనే ఉంటున్నాయి. మూలధన పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. 37,000 కోట్ల మేర గండి పడిందని అంచనా. ప్రధానంగా ఐటీ, ఫార్మాతో పాటు కొన్ని తయారీ రంగ కంపెనీల విషయానికొస్తే.. పెట్టుబడులపై దాదాపు 200 శాతం వరకూ మినహాయిం పులు అమల్లో ఉన్నాయి. దీన్ని ఇప్పుడు 60 శాతానికి కుదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను వసూళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు మినహా ఈ సారి కార్పొరేట్ రంగానికి జైట్లీ పెద్దగా చేసేదేమీ లేకపోవచ్చనేది ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ నిధి ఏర్పాటుతో పాటు మూడేళ్లపాటు పన్ను మినహాయింపులు, సరళ నిబంధనలను అమలు చేస్తామంటూ మోదీ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్లపై మరీ కఠిన వైఖరిని ప్రదర్శిస్తారా అనేది వేచిచూడాల్సిందేనని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు