రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష నేడు

2 Jun, 2014 23:57 IST|Sakshi
రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష నేడు

న్యూఢిల్లీ: నేటికీ అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే వ్యూహంతో రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశముంది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై స్థూల ఆర్థిక స్థితిగతులపై చర్చించారని తెలిసింది. గత ఏప్రిల్ 1న నిర్వహించిన ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రేటును 8 శాతంగా కొనసాగించారు. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8 శాతానికిపైగా ఉండడం ఇందుకు ముఖ్యకారణం. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 9.66 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 8.59 శాతంగా నమోదయ్యాయి.
 
 ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్‌బీఐ తొలి ద్రవ్య విధాన సమీక్ష నేడు జరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసి, ఆర్థిక ప్రగతిని పునరుద్ధరించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.7 శాతంగా ఉంది. మోడీ సారథ్యంలో సుస్థిర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినందువల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పారిశ్రామికవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
 
 కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చకపోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా సీనియర్ ఎకనామిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండడంతో పాటు వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉండడంతో కీలక వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని రిజర్వు బ్యాంకు కొనసాగించవచ్చని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర అన్నారు.
 
 ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ గతేడాది సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కీలక రెపో రేటును మూడు సార్లు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేస్తూనే వృద్ధిని ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు యత్నిస్తోందని గత వారం జైట్లీని కలసిన అనంతరం రాజన్ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా