అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

29 Aug, 2019 08:06 IST|Sakshi

ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపుపై బ్యాంకింగ్‌ సంఘం విమర్శ

న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్‌బీఐ అదనపు బ్రాంచ్‌ ఆఫీస్‌ (ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్‌) కారాదని స్పష్టంచేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఆర్‌బీఐ ఏర్పాటయ్యిందని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విదేశీ అనిశ్చితి పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ, ద్రవ్య స్థిరత్వం, దవ్య లభ్యత, సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడ్డం వంటివి ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యాలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదలాయింపులపై ఏర్పాటయిన బిమల్‌ జలాన్‌ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్‌బీఐ  ఆమోదించిన నేపథ్యంలో ఏఐబీఈఏ తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,23,414 కోట్లు మిగులు లేదా డివిడెండ్‌ రూపంలో, మరో రూ. 52,637 కోట్లు మిగులు మూలధనం రూపంలో మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి బదలాయించాలని ఆర్‌బీఐ  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు