దేనా బ్యాంక్‌పై ఆంక్షలు ఎత్తివేయండి

12 Jun, 2018 00:33 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌కు ఏఐబీఈఏ వినతి

వడోదరా: భారీ మొండిబాకీల కారణంగా తదుపరి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వ రంగ దేనా బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అభ్యర్థించింది. ఆంక్షల మూలంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దేనా బ్యాంకును రిజర్వ్‌ బ్యాంక్‌ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేర్చడం తెలిసిందే. దీనివల్ల కొత్తగా రుణాలు మంజూరు చేయటం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి అంశాల్లో బ్యాంకు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జూన్‌ 10న ఉర్జిత్‌ పటేల్‌కు రాసిన లేఖలో ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం పేర్కొన్నారు.

బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులను ఇది అనవసర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాపార పరిమాణం ప్రకారం భారీ బ్యాంకు కాకపోయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిలో దేనా బ్యాంక్‌ కీలక పాత్ర పోషిస్తోందని వెంకటాచలం వివరించారు. 2018 మార్చి 31 నాటికి దేనా బ్యాంకులో స్థూల మొండిబాకీలు 16.27% నుంచి 22.4 శాతానికి ఎగిశాయి. విలువపరంగా చూస్తే రూ. 12,619 కోట్ల నుంచి రూ.16,361 కోట్లకు చేరాయి.

నికర ఎన్‌పీఏలు 10.66% (రూ.7,735 కోట్లు) నుంచి 11.95 శాతానికి (రూ.7,839 కోట్లు) చేరాయి. దేనా బ్యాంక్‌తో పాటు అలహాబాద్‌ బ్యాంక్, ఐడీబీఐ, యూకో తదితర బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోనే ఉన్నాయి.

ఎన్‌సీఎల్‌టీ ముందుకు 65 మొండిపద్దులు: అలహాబాద్‌ బ్యాంక్‌
కోల్‌కతా: గత ఆర్థిక సంవత్సరం(2017–18) సుమారు రూ.12,566 కోట్ల మొండిబాకీలకు సంబంధించిన 65 ఖాతాదారులపై దివాలా చట్టం కింద చర్యల కోసం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు