హైదరాబాద్‌లో మొదటి ఐకియా స్టోర్

12 Aug, 2016 00:23 IST|Sakshi
హైదరాబాద్‌లో మొదటి ఐకియా స్టోర్

భారత్‌లో తొలిస్టోర్‌కు శంకుస్థాపన
2017 చివరికల్లా ప్రారంభం
2,000 మందికి ఉపాధి అవకాశాలు
ఐకియా ఇండియా సీఈఓ జువెన్సియో


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు గురువారం శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2017 చివరినాటికి ప్రారంభం కానున్న ఈ ఔట్‌లెట్‌కు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 15 ఎకరాల స్థలాన్ని కంపెనీ కొనుగోలు చేసింది. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. సుమారు 7,500 హోం ఫర్నిషింగ్ ఉత్పత్తులను ఈ స్టోర్‌లో విక్రయిస్తారు. పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, ఉద్యోగుల పిల్లల కోసం డే కేర్ సెంటర్, 1,000 మంది కూర్చునే వీలున్న రెస్టారెంట్‌ను కూడా దీన్లో భాగంగా ఏర్పాటు చేస్తారు. రెస్టారెంట్‌లో స్వీడిష్, ఇండియన్ వంటకాలను ఆఫర్ చేస్తారు.

 
భారత్‌లోనూ ఆన్‌లైన్‌లో..

ఔట్‌లెట్ ఏర్పాటుకు ఐకియా ఇప్పటికే ముంబైలో కూడా స్థలాన్ని సమకూర్చుకుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగ ళూరులోనూ స్టోర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ మూడు 2018 కల్లా పూర్తవుతాయని ఐకియా ఇండియా సీఈవో జువెన్సియో మాజూ మీడియాకు తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 9 నగరాల్లో 25 ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు కంపెనీ రూ.10,500 కోట్ల దాకా వెచ్చించనుంది. ప్రస్తుతం భారత్ నుంచి కంపెనీ రూ.2,250 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. 2020 నాటికి ఇది రెండింతలు అవుతుందని భావిస్తోంది. ఈ-కామర్స్ సేవల్ని భారత్‌లో పరిచయం చేయనుంది కూడా. నాలుగైదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఆదాయంలో ఈ-కామర్స్ నుంచి 10 శాతం సమకూరుతుందని అంచనా వేస్తోంది. 2015 చివరినాటికి ఇది 3 శాతమే ఉంది. కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్న 28 దేశాలకుగాను సగం మార్కెట్లలో ఈ-కామర్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

 

జీఎస్‌టీతో ఊతం..
జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లకు అతిపెద్ద సానుకూల సందేశం ఇచ్చినట్లయిందని మాజూ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లకు జీఎస్‌టీ ధైర్యాన్నిస్తుందని, దీంతో నిధులు కూడా వస్తాయని చెప్పారాయన. వ్యాపారానికి, ప్రజలకు దీనివల్ల ప్రయోజనమేన ని, ఉత్పత్తులు తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా