ఏసీల మార్కెట్లో ‘హీట్‌’!

28 Feb, 2017 01:16 IST|Sakshi
ఏసీల మార్కెట్లో ‘హీట్‌’!

భానుడి ప్రతాపంతో అమ్మకాల జోరు
విక్రయాలు 57.5 లక్షల యూనిట్లకు
అంచనా వేస్తున్న ఏసీ కంపెనీలు
ఇన్వర్టర్‌ ఏసీలకు పెరిగిన డిమాండ్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌ కండీషనర్ల మార్కెట్‌ జోరు మీద ఉంది. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరం అమ్మకాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. వేసవి ఈసారి ముందుగా ప్రారంభం కావడంతోపాటు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఎండ తీవ్రత 2 డిగ్రీలు ఎక్కువగా ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇంకేముంది భానుడి ప్రతాపంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే జోష్‌తో కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016లో 50 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2017లో 57.5 లక్షల యూనిట్లు దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

జూన్‌లోపు కొంటే ప్రయోజనం..
ఏసీల తయారీలో వాడే ముడి పదార్థాల ధర అంతర్జాతీయంగా పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ కంపెనీలు ధరలను సవరించడం లేదు. ప్రస్తుతం ఏసీల ధర పెరిగే అవకాశం లేదని బ్లూస్టార్‌ ఈడీ బి.త్యాగరాజన్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. జూన్‌లోపు కొనుగోలు చేసిన వారికి ప్రయోజనమని చెప్పారు. ఆ తర్వాత జీఎస్టీ అమలవుతుందని, తద్వారా ఏసీల ధర 7% దాకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమపై ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. ఇక విక్రయాల పరంగా మెట్రోయేతర నగరాలు, పట్టణాల వాటా 55 శాతముందని వివరించారు. దేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై, తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏసీల అమ్మకాల్లో ముందంజలో ఉన్నాయి. కాపర్‌తో తయారైన మోడళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది.

విద్యుత్‌ను ఆదాచేసే..
బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) రేటింగ్‌ ప్రమాణాలు 2018 జనవరి 1 నుంచి మారుతున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతమున్న 5 స్టార్‌ కాస్తా 3 స్టార్‌ అవుతుంది. అంటే ప్రమాణాలు మరింత కఠినం అవుతాయన్న మాట. ఇక 3 స్టార్‌ మోడళ్ల వాటా ఇప్పుడు ఏకంగా 50 శాతంపైగా ఉంది. నూతన రేటింగ్‌ ప్రమాణాలు అమలైతే విద్యుత్‌ను గణనీయంగా ఆదాచేసే ఇన్వర్టర్‌ ఏసీల విక్రయాలు జోరందుకుంటాయని ప్యానాసోనిక్‌ అంటోంది. మొత్తం అమ్మకాల్లో ఇన్వర్టర్‌ ఏసీల వాటా ప్రస్తుతం 10 శాతముంది. 2017లో ఇది 15 శాతానికి చేరొచ్చని బ్లూస్టార్‌ తెలిపింది. ఈ విభాగం మోడళ్ల ధర తగ్గుతూ వస్తోందని పేర్కొంది. వృద్ధి రేటు 50% ఉందని బ్లూ స్టార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీపీ ముకుందన్‌ మీనన్‌ చెప్పారు. బ్లూ స్టార్‌   80% వృద్ధిని నమోదు చేసిందన్నారు. హైదరాబాద్‌లో ఇన్వర్టర్‌ ఏసీలకు డిమాండ్‌ గతం కంటే ఎక్కువగా ఉందని.. ఈ వేసవి కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. డౌన్‌ పేమెంట్‌ లేకుండానే ఏసీని సొంతం చేసుకోవచ్చన్నారు.

పోటాపోటీగా మోడళ్లు..: ప్రపంచంలో తొలిసారిగా గుండ్రని ఆకారంలో ఏసీలను శాంసంగ్‌ తయారు చేసింది. బిల్ట్‌ ఇన్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్లతో పలు ఏసీలను ప్యానాసోనిక్‌ విడుదల చేసింది. సోలార్‌తో నడిచే హైబ్రిడ్‌ ఏసీలను వీడియోకాన్‌ ఆవిష్కరించింది. ధర రూ.99 వేల నుంచి ప్రారంభం. 2017లో 6.5 లక్షల యూనిట్లను విక్రయిస్తామని వీడియోకాన్‌ ఏసీ విభాగం సీవోవో సంజీవ్‌ బక్షి చెప్పారు. కంపెనీ వాటాను ప్రస్తుత 9 శాతం నుంచి 13కు చేరుస్తామన్నారు. నూతన తరం ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలను బ్లూ స్టార్‌ విడుదల చేసింది. ఈ ఏడాది బ్లూస్టార్‌ 20% వృద్ధి అంచనా వేస్తోంది. 10% మార్కెట్‌ వాటా, 30 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు ప్యానాసోనిక్‌ ఇండియా ఎండీ మనీష్‌ శర్మ తెలిపారు. డ్యూయల్‌ ఇన్వర్టర్‌ కంప్రెసర్‌ ఏసీలను ఎల్‌జీ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు