ఏసీల అమ్మకాలు కూల్..!

19 Mar, 2015 03:21 IST|Sakshi
ఏసీల అమ్మకాలు కూల్..!

2015లో 43 లక్షల ఏసీల విక్రయం అంచనా
- 15% వృద్ధి ఖాయం: పరిశ్రమ
- కంపెనీలకు సానకూల వాతావరణం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల జోష్‌తో ఎయిర్ కండీషనర్ల(ఏసీ) మార్కెట్ వేడెక్కింది. భానుడి ప్రతాపానికితోడు దేశవ్యాప్తంగా సెంటిమెంటు బలంగా ఉండడంతో ఏసీల విపణి జోరందుకుంది.గతేడాదితో పోలిస్తే 2015లో 15 శాతంపైగా వృద్ధి ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

భారత్‌లో 2014లో రూమ్ ఏసీలు 37.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో 43 లక్షలకుపైగా యూనిట్లు నమోదవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది 2.50 లక్షల ఏసీలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 15% వృద్ధి ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 5.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. సహజంగా జనవరి-మార్చి కాలంలో 25 శాతం అమ్మకాలు నమోదవుతాయి. భారత్‌లో వోల్టాస్, ఎల్‌జీ, శాంసంగ్‌ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌జీ, బ్లూ స్టార్, శాంసంగ్‌లు తొలి 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
 
ఇన్వర్టర్ ఏసీల హవా..
భారత్‌లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు ఊపందుకున్నాయి. విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే ఈ మోడళ్ల వాటా ప్రస్తుతం 8%గా ఉంది. 2015లో ఈ విభాగం 15%కి, 2018 నాటికి 30 శాతానికి ఎగబాకుతుందని బ్లూస్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘5 స్టార్‌తో పోలిస్తే ధర 25% అధికం. అయితే విద్యుత్‌ను ఆదా చేసుకోవాలంటే ఇన్వర్టర్ ఏసీ వాడకమొక్కటే మార్గం.

ఈ ఏడాది బ్లూస్టార్ నుంచి ఈ విభాగంలో 20-25 కొత్త మోడళ్లు రానున్నాయి’ అని చెప్పారు. ఇన్వర్టర్ ఏసీలు చైనాలో 80%, జపాన్‌లో 50% ఆక్రమించేశాయి. అల్యూమినియంకు బదులు కాపర్ కాయిల్‌తో తయారైన ఏసీలపట్ల కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన వివరించారు. ఏసీల జీవిత కాలం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు.
 
తెలుగు వెలుగులు..
ఏసీల ఎంపిక విషయంలో తెలుగు కస్టమర్లు ముందుంటున్నారు. విండో ఏసీలను దాదాపుగా మర్చిపోయారు. 2014లో కేవలం 12,500 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. స్ప్లిట్ ఏసీల వాటా అత్యధికంగా 95 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పరిశ్రమలో 5 స్టార్ ఏసీల వాటా 20 శాతమైతే, తెలుగు రాష్ట్రాల్లో ఇది 23%. విక్రయాల్లో తెలుపు రంగు మోడ ళ్లు 1.75 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. తెలుపు తర్వాత ఎరుపు, బంగారు వర్ణానికి డిమాండ్ ఎక్కువ. మొత్తంగా 50% ఏసీ అమ్మకాలు చిన్న పట్టణాల నుంచి నమోదవుతున్నాయి. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 1 కోటి యూనిట్లకు చేరుకోవచ్చని బ్లూస్టార్ అంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి.

మరిన్ని వార్తలు