ఎయిర్ కోస్టా.. ఇక దేశవ్యాప్తం!

4 Oct, 2016 01:17 IST|Sakshi
ఎయిర్ కోస్టా.. ఇక దేశవ్యాప్తం!

కంపెనీకి పాన్ ఇండియా లైసెన్సు
చిన్న నగరాలకూ విమాన సేవలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా ప్రయాణంలో మరో కీలక మలుపు. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఏ నగరం నుంచైనా సేవలు అందించేందుకు కంపెనీకి మార్గం సుగమం అయింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి లైసెన్సు దక్కించుకుంది. ఇప్పటి వరకు ప్రాంతీయ లైసెన్సు కలిగిన ఈ సంస్థ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, తిరుపతి, వైజాగ్ నగరాలకు సర్వీసులను నడిపింది.

పాన్ ఇండియా లెసైన్సుతో కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు కంపెనీ కసరత్తు ప్రారంభించింది. తాజా లైసెన్సుతో సంస్థ ఢిల్లీ, ముంబై, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, ఇండోర్ వంటి నగరాల పై దృష్టి పెట్టనుంది. చిన్న పట్టణాలు, నగరాలను మెట్రోలతో అనుసంధానించాలన్న సంస్థ విధానాన్ని కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. ఢిల్లీ, ముంబైని దేశవ్యాప్తంగా ఉన్న చిన్న నగరాలతో కనెక్ట్ చేస్తామని చెప్పారు.

 డిసెంబరు నుంచే..: కొత్త నగరాల కు ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎయిర్ కోస్టా విమానాలు ఎగరనున్నాయి. ప్రస్తుతం కంపెనీ ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. సంస్థ వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. అక్టోబరులో మరో విమానం వచ్చి చేరుతోంది. ఏడాదిలో మరో రెండు మూడు ఫ్లైట్స్ జత కూడనున్నాయి. 2018 నాటికి అంతర్జాతీయంగా సేవలు అందించాలని ఎయిర్ కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని కృతనిశ్చయంతో ఉన్నారు.

2013 అక్టోబరు 15 నుంచి కంపెనీ తన సేవలను ప్రారంభించింది. ఇ-195ఇ2, ఇ190ఇ2 రకం 50 విమానాల కోసం 2014లో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు 2018 నుంచి ఎయిర్ కోస్టా ఖాతాలోకి రానున్నాయి. అంతర్జాతీయ సేవలను దృష్టిలో పెట్టుకునే సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇప్పటి దాకా 20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఎయిర్ కోస్టా విమానాల్లో ప్రయాణించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు