ఎగరాలంటే పార్టనర్‌ రావాలి

8 Mar, 2017 07:41 IST|Sakshi
ఎగరాలంటే పార్టనర్‌ రావాలి

అందుకు సమయం పడుతుంది:ఎయిర్‌ కోసా
అంత వరకు బుకింగ్‌లు రద్దు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : విమానయాన సంస్థ ఎయిర్‌ కోస్టాకు కష్టాలు తీరేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గత వారం నుంచి సంస్థ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విమానాలు మళ్లీ ఎప్పుడు ఎగిరేది అన్న విషయంలో ఇంకా సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికి ఎటువంటి బుకింగ్‌లను కంపెనీ స్వీకరించడం లేదు.  కంపెనీ తన వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ నెలకు కూడా బుకింగ్‌లను తీసుకోవట్లేదు. నిధుల లేమితో కంపెనీ సతమతమవుతోంది.

ఎయిర్‌ కోస్టాలోకి కొత్త భాగస్వామి వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని సంస్థ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కవి చౌరాసియా సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియ సాధారణ విషయం కాదు. వాటా విక్రయం విషయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక రోజులో అంతా పూర్తి అయ్యేదీ అసలే కాదు. ఇందుకు సమయం పడుతుంది’ అని వివరించారు. మార్చి 15కల్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

అన్‌ సీజన్‌లో ఇలా..
సంక్రాంతి తర్వాత నుంచి భారత విమానయాన రంగంలో అన్‌ సీజన్‌ మొదలవుతుంది. తిరిగి వేసవి సెలవులు ప్రారంభం అయితేనే సీజన్‌ మొదలయ్యేది. కొన్ని సంస్థల దూకుడుతో ఇప్పటికే ఇతర కంపెనీల విమానాల్లో సీట్లు నిండడం లేదు. నూరు శాతం సీట్లతో నడిస్తేనే విమాన కంపెనీలకు లాభాలు వస్తాయని ఎయిర్‌ కోస్టా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఉన్నత తరగతి రైలు టికెట్ల కంటే విమాన ప్రయాణం ఇప్పుడు చవక. దేశంలో ధరల యుద్ధం జరుగుతోంది. అసలే అన్‌ సీజన్‌. విమానాలు అద్దెకు ఇచ్చిన కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం బాకీ పడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీకి సమస్య రావడం దురదృష్టకరం. త్వరలోనే గట్టెక్కుతామన్న ధీమా ఉంది’ అని వ్యాఖ్యానించారు.

జీఈ కొనసాగుతుంది..
పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్‌ కోస్టాకు 2015–16లో రూ.327 కోట్ల ఆదాయంపై సుమారు రూ.130 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉంది. జీఈ క్యాపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ సమకూర్చిన రెండు విమానాలను కంపెనీ నడుపుతోంది. ఈ కంపెనీతో ఎటువంటి వివాదం లేదని ఎయిర్‌ కోస్టా ప్రతినిధి స్పష్టం చేశారు.

తమ కంపెనీలో వాటా తీసుకోవడానికి ఒక భాగస్వామి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాటా విక్రయానంతరం కూడా జీఈ విమానాలే నడుస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఎయిర్‌ కోస్టా 50 ఎంబ్రార్‌ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. 2018 నుంచి ఇవి జతకూడనున్నాయి. దేశవ్యాప్తంగా సర్వీసులు అందించేందుకు లైసెన్సు కూడా దక్కించుకుంది. వచ్చే ఏడాది విదేశాలకు విమానాలు నడపాలన్నది కంపెనీ ఆశయం.

>
మరిన్ని వార్తలు