ఎయిర్‌ డెక్కన్‌ మరో జర్నీ

14 Dec, 2017 00:15 IST|Sakshi

22 నుంచి సేవలు షురూ!!

ఆరంభ ఆఫర్‌ కింద రూ.1కే ప్రయాణం

తొలి విమానం నాసిక్‌ నుంచి ముంబైకి  

న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి చౌక విమానయాన సేవల్లోకి ప్రవేశించి... అతితక్కువ ఛార్జీకే ఆకాశయానాన్ని పరిచయం చేసిన ‘ఎయిర్‌ డెక్కన్‌’...  రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఉడాన్‌ కింద తొలి విమానాన్ని నడపటానికి రెడీ అయ్యింది. డిసెంబర్‌ 22 నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. నాసిక్‌  నుంచి ముంబైకు వెళ్లే ఈ విమాన ప్రయాణం కోసం... రూ.1,400ల ప్రారంభ ధరతో గురువారం నుంచి బుకింగ్స్‌ ఆరంభిస్తోంది. ఎయిర్‌ డెక్కన్‌ తొలిగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి ఇతర చిన్న పట్టణాలకు ఫ్లైట్స్‌ను నడపనుంది. ఇది ‘సింప్లిఫై’ ట్యాగ్‌లైన్‌తో ‘సామాన్యులకు విమాన ప్రయాణం’ లోగోతో రీఎంట్రీ ఇస్తోంది.

రూ.1 ఆరంభ ఆఫర్‌
ఎయిర్‌ డెక్కన్‌ తన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభిస్తున్న సందర్భంగా రూ.1కే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇది అందరికీ కాదు. కొందరికి మాత్రమే. ‘కొందరు అదృష్టవంతులు ఒక్క రూపాయికే ప్రయాణించొచ్చు. సాధారణంగా నాసిక్‌–ముంబై ఫ్లైట్‌ విమాన ప్రయాణం ధర దాదాపు రూ.1,400గా ఉండొచ్చు’ అని కెప్టెన్‌ గోపీనాథ్‌ తెలిపారు.

నాసిక్, పుణె, ముంబై, జల్‌గావ్‌లకు డైలీ రిటర్న్‌ ఫ్లైట్స్‌ నడుపుతామని ఆయన చెప్పారు. జనవరి నుంచి నాలుగు ఫ్లైట్స్‌తో సర్వీసుల నడుపుతామని, ఒక్కదాన్ని రిజర్వులో ఉంచుతామని తెలిపారు. ‘మా విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ మా చిన్న ప్లేన్స్‌కు స్లాట్స్‌ కేటాయించటం లేదు. పౌరవిమానయాన శాఖకు పలు అభ్యర్థనలు చేశాకే స్లాట్స్‌ను పొందాం’ అని గోపినాథ్‌ తెలిపారు.

ఎయిర్‌ డెక్కన్‌ గురించి..
కెప్టెన్‌ జి.ఆర్‌.గోపినాథ్‌ 2003లో ఎయిర్‌ డెక్కన్‌ను ఏర్పాటు చేశారు. ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేది. అప్పుడు చౌక ధరల విమాన సర్వీసులకు ఇది పేరొందింది. కానీ తర్వాత నష్టాలు ఎక్కువ కావడంతో 2008లో ఎయిర్‌ డెక్కన్‌ను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ దీన్ని కింగ్‌ఫిషర్‌ రెడ్‌గా రీబ్రాండ్‌ చేసింది. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012లో మూతపడింది.

కాగా మార్చిలో జరిగిన తొలి రౌండ్‌ బిడ్డింగ్‌లో దేశవ్యాప్తంగా 120 రూట్లలో విమానాలు నడపటానికి ఉడాన్‌ పథకం కింద ఐదు సంస్థలు అనుమతి పొందాయి. వాటిలో అలయన్స్‌ ఎయిర్, స్సైస్‌ జెట్, ఎయిర్‌ ఒడిషాతో పాటు ఎయిర్‌ డెక్కన్, తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌ (ట్రూ జెట్‌) కూడా ఉన్నాయి. ట్రూజెట్‌ ఇప్పటికే తన ఉడాన్‌ సేవలు ప్రారంభించింది. ఎయిర్‌డెక్కన్‌ ఇపుడు ప్రారంభిస్తోంది. గంట విమాన ప్రయాణానికి కనీస టికెట్‌ ధర రూ.2,500. టైర్‌–2, టైర్‌–3 పట్టణాలకు విమాన సర్వీసులకు విస్తరించటం, సామన్యులకు విమాన ప్రయాణం చేరువ చేయడం అనే లక్ష్యంతో కేంద్రం ఉడాన్‌ స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.


రెండో రౌండ్‌ బిడ్డింగ్‌లో ఇండిగో, జెట్‌
ఉడాన్‌ రెండో రౌండ్‌ బిడ్డింగ్‌లో ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌ జెట్, జూమ్‌ ఎయిర్‌ సంస్థలు పాల్గొంటున్నాయి. ఇవి ఇప్పటికే బిడ్‌లు వేశాయి. ఉడాన్‌ స్కీమ్‌లో పాల్గొనే సంస్థలు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కోరుకోవచ్చు. ఇండిగో, స్పైస్‌ జెట్‌ సంస్థలు వీజీఎఫ్‌ అక్కర్లేదని పేర్కొన్నాయి. ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం తొలిసారి బిడ్గింగ్‌లో పాల్గొంటున్నాయి.

మరిన్ని వార్తలు