ఎయిర్ ఇండియా ఖర్చులు తగ్గించుకోవాలి

6 Dec, 2014 23:47 IST|Sakshi
ఎయిర్ ఇండియా ఖర్చులు తగ్గించుకోవాలి

పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఆదేశం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన నిర్వహణ పద్దులకు సంబంధించిన వ్యయాలను కనీసం 10% తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పని తీరును మెరుగుపరచుకోవాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఎయిర్ ఇండియా అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఇండియా పనితీరుపై ఎయిర్ ఇండియా అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ అనంతరం ఈయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ ఇండియా సీఎండీ రోహిత్ నందన్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రజంటేషన్‌ను ఇచ్చారు.

త్వరితంగా టర్న్ అరౌండ్
ఎయిర్ ఇండియా గత ఆరునెలల పనితీరును అశోక్ గజపతి రాజు సమీక్షించారు.  ఈ ఆరు నెలల కాలంలో కంపెనీ మార్కెట్ వాటా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులను నడపాలని, జాప్యాన్ని నివారించాలని, విమాన సర్వీసులు ఆలస్యమైతే, ఆ వివరాలను సకాలంలో ప్రయాణికులకు అందించాలని పేర్కొన్నారు.  ఏదైనా సంక్షోభం ఉత్పన్నమైతే, ఎదుర్కొనేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.

త్వరితంగా టర్న్ అరౌండ్ సాధించేందుకు విమానయాన ఇంధనం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో  లాభదాయకత మెరుగుపరుచుకునేందుకు వేగవంతమైన చర్యలను తీసుకోవాలని, వీలైనంత త్వరగా టర్న్ అరౌండ్ సాధించాలని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.5,400 కోట్ల నష్టాలు వచ్చాయి.

>
మరిన్ని వార్తలు