ఆస్తుల అమ్మకంపై ఎయిర్‌ ఇండియా దృష్టి 

16 Nov, 2018 01:16 IST|Sakshi

ముంబై: నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియా దేశవ్యాప్తంగా తనకున్న 70 నివాస, వాణిజ్య ఆస్తులను విక్రయించే ప్రణాళికతో ఉంది. దీని ద్వారా రూ.700– 800 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 16 పట్టణాల పరిధిలో ఇవి ఉన్నాయి. ప్రభుత్వరంగంలోని ఎంఎస్‌టీసీ ద్వారా ఈ– వేలాన్ని నిర్వహించనుంది. తన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచన గతంలో యూపీఏ ప్రభుత్వం 2012లో అనుమతించిన ప్రణాళికకు లోబడే ఉండడం గమనార్హం.

ఇందులో భాగంగా 2014 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య రూ.5,000 కోట్ల నిధులను ఎయిర్‌ ఇండియా సమీకరించాల్సి ఉంది. ‘‘70 ఆస్తులను ఈ–వేలం వేయడం ద్వారా రూ.700–800 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నాం. వీటిల్లో నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని గతంలోనూ వేలానికి ఉంచగా కొనుగోలుదారులు రాలేదు’’ అని ఓ అధికారి తెలిపారు. గత నెలలో ఎయిర్‌ ఇండియా చెన్నై, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, అమృత్‌సర్‌లో 14 ఆస్తులను అమ్మకానికి ఉంచిన విషయం గమనార్హం. 

మరిన్ని వార్తలు